AP CM Delhi Visit:  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోాసారి ఢిల్లీ వెళ్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా... ఆయన ఢిల్లీ వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఈసారి భేటీలో సీఎం ఎవరెవర్ని కలుస్తారు... టూర్ అజెండా ఏంటన్నది మాత్రం తెలియడం లేదు. 


మార్చి 16న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ టూర్‌ ముగిసి 15 రోజులు కాక ముందే మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు సీఎం జగన్. 


ఇవాళ సాయంత్రం విశాఖలో పర్యటించనున్నారు సీఎం. అక్కడ జరుగుతున్న జీ20 గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం బయల్దేరి అమరావతి చేరుకుంటారు. అక్కడి నుంచే ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. 


మార్చి 17న పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో మోదీతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో చర్చించినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్‌ సీపీ ఎంపీలు కూడా సీఎం జగన్ వెంట ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా జగన్ కలిశారు. 


రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తున్నా.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారం జరగలేదన్నారు జగన్. గతంలో తాను ప్రస్తావించిన అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారని.. అయినా కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయన్నారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. 2 సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించిందని వెంటనే ఆమోదం తెలపాల్సిందిగా కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు కూడా గుర్తు చేశారు. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు రూ.7,058 కోట్లు రావాల్సి ఉందన్నారు. 


సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలు వ్యంగ్యపు ట్వీట్లు చేశారు. ఓ వైపు వైఎస్ వివేకా హత్య కేసు.. ఇంకో వైపు లిక్కర్ కేసు.. రెండు కేసుల్లో సీబీఐ, ఈడీ దూకుడుగా ఉన్నాయని అందుకే జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుందని టీడీపీ నేతలు అప్పట్లోనే విమర్శలు చేశారు.