తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు ఒక డ్రామా- ఒక రికార్డింగ్ డాన్స్ అంటూ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేశ్‌ ఫైర్ అయ్యారు. చంపిన చేతుల్తోనే దండేసి దండం పెడుతున్నారని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.


దౌర్భాగ్య రాజకీయ నేత చంద్రబాబు... జోగి రమేష్ 
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు మహానాడు పేరుతో నిర్వహిస్తున్నకార్యక్రమాన్ని చూసి, ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. మహానాడు పేరిట రాజమండ్రిలో చంద్రబాబు వెకిలిచేష్టలు చేస్తున్నారని అన్నారు. మహానాడు వేదికపై ఒకపక్క ఎన్టీ రామారావు  విగ్రహం పెట్టి ఆయన చిత్రపటానికి దండ వేసి చంద్రబాబు దండం పెట్టడంతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని అన్నారు. చంద్రబాబు ఆయన తోక నాయకులు కలసి ఎంత దిగజారిపోయారో మహానాడు వేదికను చూస్తే అర్థం అయ్యిందన్నారు. రాజకీయాల్లో ఒక వ్యక్తిని రాళ్లతో, కర్రలతో, చెప్పులతో కొట్టడం... ఆ వ్యక్తిని మానసికంగా, శారీరకంగా పతనం చేసి చంపడం.. మరలా అదే వ్యక్తి శతజయంతి ఉత్సవాల పేరిట చంపిన వ్యక్తికి.. మీరు చేతులెత్తి దండం పెట్టి దండలేయాల్సిన దౌర్భాగ్యం ఏంటని జోగి రమేష్ ప్రశ్నించారు.


నూరేళ్లు బతకాల్సిన ఎన్టీఆర్ ను సమాధి చేశారు! 
నూరేళ్లు బతకాల్సిన నాయకుడ్ని 28 ఏళ్ళ క్రితమే సమాధి చేసేసి, ఆయన ఆయుర్థాయాన్ని తగ్గించి, చివరి దశలో అవమానించారన్నారు. పదవి లాక్కుని, వెన్నుపోటు పొడిచి, ఒకరకంగా హత్య చేసిన తర్వాత, ఈరోజు శత పురుషుడ్ని - శఖ పురుషుడ్ని... స్మరించుకుంటూ డ్రామాలు ఆడుతున్నారని తెలుగు దేశం నేతలపై విమర్శలు గుప్పించారు జోగి రమేష్.  రాజమండ్రిలో నడుస్తున్నది ఒక డ్రామా- ఒక రికార్డింగ్ డ్యాన్స్ మాత్రమే తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం లేదన్నారు.


153 పేజీలు ఎందుకు... ?
ప్రజలకు ఏం చేశారన్నది మహానాడు ఎజెండాలోనే లేదని, టీడీపీ మహానాడు తీర్మానాలు అంటూ 153 పేజీల మెటీరియల్ పబ్లిష్ చేయటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అనే చెవిటివాడి చెవిలో శ్రీకృష్ణుడు అనే ఎన్టీఆర్ శంఖం ఊదుతున్నట్టుగా మొదటి పేజీ పబ్లిష్ చేశారని ఎద్దేవా చేశారు.


 153 పేజీల ముసాయిదా తీర్మానాల పుస్తకంలో టీడీపీ  పరిపాలనలో ఏం చేశారనే విషయాలు చెప్పలేదన్నారు. చంద్రబాబు పేరు చెబితే.. ఈ పథకం గుర్తుకు వస్తుందని ఒక్క వాక్యం కూడా లేదన్నారు.14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు వల్ల, ఒక పేద ఇంటికి పలానా మంచి జరిగిందని ఒక్క చాప్టర్ కూడా రాయలేకపోయారని విమర్శించారు. 2014-19 మధ్య రైతు రుణాలన్నీ మాఫీ చేసేసినట్టు, కౌలు రైతులకు కూడా రుణ మాఫీ జరిగినట్టు, పంటల బీమా ఏటా ఇచ్చినట్టు, ఇవ్వని సున్నా వడ్డీ రుణాలు ఇచ్చినట్టు, పూర్తి చేయని ప్రాజెక్టులను పూర్తి చేసేసినట్టు, పాడి పరిశ్రమ కూడా వర్థిల్లినట్టు అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని అన్నారు.


పేదల ఇళ్ళనూ అవమానించిన చంద్రబాబు 
పథకాలకు సంబంధించి అమ్మఒడి కన్నా గొప్ప పథకాన్ని తాము ఇచ్చినట్టు, డ్వాక్రా మహిళలకు రుణాలన్నీ రద్దు చేశామని, బెల్టు షాపులు లేవని, మద్యం ధరల్ని నియంత్రించినట్టు టీడీపీ ప్రచారం చేసుకుంటుందని అన్నారు. టీడీపీ హయాంలో ఒక్క సెంటు భూమిని కూడా ఇళ్ళ నిర్మాణానికి ఇవ్వకపోయినా, ఇచ్చేశామని చెప్పుకోవటం దారుణని వ్యాఖ్యానించారు. తాను పడుకోవడానికి కూడా ఇళ్ళు సరిపోవని అచ్చెన్నాయుడు.. తన టాయిలెట్ కూడా ఇంతకంటే పెద్దదిగా ఉంటుందని లోకేశ్.. పేదల ఇళ్ళను సమాధులతో పోల్చిన చంద్రబాబు నాయుడును ఏమనాలో అర్దం కావటం లేదన్నారు.