ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను గురువారం నాడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల నామ సంవత్సరం కావటంతో బడ్జెట్ కేటాయింపులపై ఆసక్తి నెలకొంది.
ఏపీ బడ్జెట్...
సంక్షేమం, అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ వార్షిక బ‌డ్జెట్ ను స‌భ‌లో ప్రవేశ‌పెడుతుంది ఏపీ ప్రభుత్వం. గ‌తేడాది కంటే ఎక్కువ అంచ‌నాల‌తో బ‌డ్జెట్ రూపొందించిన‌ట్లు స‌మాచారం. వైసీపీ స‌ర్కార్ ప్రవేశ‌పెడుతున్న చివ‌రి పూర్తి స్థాయి బడ్జెట్ కావ‌డంతో ఎన్నిక‌ల బ‌డ్జెట్ ను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. గురువారం ఉద‌యం 8 గంట‌ల‌కు బ‌డ్జెట్ కు ఆమోదం తెల‌ప‌నుంది కేబినెట్.
ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగం...
వ‌చ్చే ఆర్ధిక సంవ‌త్సరానికి వార్షిక బ‌డ్జె (2023-24)ను గురువారం స‌భ‌లో ప్రవేశ‌పెడుతుంది వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం. ఉద‌యం 11 గంట‌లకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశ‌పెట్టనున్నారు. ఈసారి కూడా ఎప్పటిలాగే వ్యవ‌సాయానికి ప్రత్యేక బ‌డ్జెట్ ను మంత్రి కాకాణి గోవ‌ర్ధన్ రెడ్డి ప్రవేశ‌పెట్టనున్నారు. మండ‌లిలో ఉప‌ ముఖ్యమంత్రి అంజాద్ బాషా సాధార‌ణ బ‌డ్జెట్ ను, వ్యవ‌సాయ బడ్జెట్ ను సిదిరి అప్పలరాజు ప్రవేశ‌పెట్టనున్నారు. గ‌తేడాది రెండు ల‌క్షల 56 వేల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ‌పెట్టింది ప్రభుత్వం. కానీ ఈసారి మాత్రం సుమారు రెండు ల‌క్షల 70 వేల కోట్లతో బ‌డ్జెట్ అంచ‌నాలు రూపొందించిన‌ట్లు తెలిసింది. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లుండ‌టంతో ఇదే చివ‌రి పూర్తి స్థాయి బ‌డ్జెట్ అవుతుంది. అంతేకాదు ఎన్నిక‌ల బడ్జెట్ కావ‌డంతో గ‌తానికంటే ఎక్కువ‌గా కేటాయింపుల‌తో బ‌డ్జెట్ రూప‌క‌ల్పన చేసిన‌ట్లు తెలుస్తోంది.
గతంలో ఇలా... మరి ఇప్పుడు...
గతేడాది గ్రామీణాభివృద్దితో పాటు విద్య, వైద్యం, సంక్షేమం, సాగునీటి రంగాల‌కు అధిక కేటాయింపులు చేసింది ప్రభుత్వం... వ్యవ‌సాయ బ‌డ్జెట్ ను 13వేల 630 కోట్లతో ప్రవేశ‌పెట్టింది. ఈసారి కూడా న‌వ‌ర‌త్నాలు, సంక్షేమ ప‌థ‌కాల‌కు కేటాయింపులు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఈసారి బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు అందించే స‌మ‌యంలోనే ఆర్ధిక శాఖ అధికారులు ప‌లు శాఖ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. కేటాయింపులు ఎక్కువ‌గా చేసిన‌ప్పటికీ కొన్ని శాఖ‌ల్లో ఆమేర పూర్తిస్థాయిలో ఖ‌ర్చు పెట్టడం లేదు. దీంతో ప్రతిప‌క్షాల విమ‌ర్శల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లవుతుంది. దీంతో ఈసారి ఖ‌చ్చిత‌మైన లెక్కల‌తో అంచ‌నాలు త‌యారుచేయాల‌న్న సూచ‌న‌ల‌తో ప‌లు శాఖ‌లు ముంద‌స్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. గతేడాది సంక్షేమ ప‌థ‌కాల‌కు న‌గ‌దు బ‌దిలీ కోసం 48 వేల కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈసారి 50 వేల కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లు తెలిసింది.మొత్తం 21 ప‌థ‌కాల‌కు నేరుగా ల‌బ్దిదారుల ఖాతాల్లోకి న‌గ‌దు బ‌దిలీ చేయ‌నుంది ప్రభుత్వం.
నవరత్నాలకే అధిక ప్రాధాన్యత....
ఇక న‌వ‌ర‌త్నాల‌తో పాటు విద్య‌, వైద్య రంగాల‌కు మొద‌టి నుంచి అధిక ప్రాధాన్య‌త ఇస్తుంది ప్ర‌భుత్వం.. విద్య‌,వైద్య రంగాల్లో నాడు - నేడు కోసం భారీగా నిధులు కేటాయించే అవ‌కాశం ఉంది. మ‌హిళాభివృద్ది కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయనుంది. గ‌తేడాది త‌క్కువ కేటాయింపులు చేసిన ప‌లు శాఖ‌ల‌కు ఈసారి కాస్త ఎక్కువ‌గా కేటాయింపులు చేసిన‌ట్లు స‌మాచారం. సోషియో ఎక‌నామిక్ స‌ర్వే ప్ర‌కారం రాష్ట్ర వృద్ది రేటు కూడా బాగానే ఉంది. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మ‌ణ‌, ఈబీసీ వ‌ర్గాల‌కు కేటాయింపుల గురించి ప్ర‌త్యేకంగా బ‌డ్జెట్ లో ప్ర‌స్తావించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎన్నిక‌ల బ‌డ్జెట్ కావ‌డం, 98 శాతం హామీలు నెర‌వేర్చామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వం.. ఈసారి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా ఎలా ముందుకెళ్తుంద‌నేది ఉత్కంఠ‌గా మారింది. ఎన్నికలకు సమయం దగ్గర పడటం, వచ్చే ఎడాది పూర్తిగా ఎన్నికల ఫ్లేవర్ లో బడ్జెట్ సమావేశాలు ఉండే అశకాశం ఉండటంతో ఇప్పుడే పూర్తిగా ప్రజలను ఆదుకునే విధంగా బడ్జెట్ ఉండాలని కేటాయింపులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బడ్జెట్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.