AP Budget Sessions 2023-24:

  అభివృద్ధిలో దేశానికే ఏపీ రోల్‌ మోడల్‌గా నిలిచిందని, ఆర్థిక నిపుణులే ఆశ్చర్యపోయేలా రాష్ట్రాన్ని డెవలప్ చేశామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ఏపీ సాధించిన 11.28 శాతం ఆర్థిక వృద్ధి రేటు ఏ రాష్ట్రంలోనూ లేదని, ఆర్థిక నిపుణులే అధ్యయనం చేసేలా ఏపీలో ఆర్థిక వృద్ధి రేటు ఉందన్నారు. విలువలు, విశ్వసనీయతే పునాదులుగా పనిచేస్తున్నామని, అవినీతి, లంచాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరుగుతోందన్నారు. 30.75 లక్షల ఇళ్ల పట్టాలు అందించాం అన్నారు.


ఎన్నికలు జరిగే సమయం వరకే రాజకీయాలు అని, ఫలితాలు వచ్చిన తరువాత అన్ని పార్టీల వారికి, రాష్ట్ర ప్రజలందరికీ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపజేశామన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 80 శాతం నెరవేర్చామన్నారు. మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంధం అని భావించి రాజకీయ వ్యస్థలో గొప్ప మార్పును తీసుకొచ్చాం అన్నారు సీఎం జగన్. పాలనలో పారదర్శకత తీసుకొచ్చేలా నాలుగేళ్ల పాలన సాగిందని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు.


రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను 4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచాం అని.. తమ ప్రభుత్వం దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం అండగా ఉందని, . వైసీపీ అధికారంలోకి వచ్చాక 1.50 లక్షల ఎంఎస్‌ఎంఈలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయంపై 62 శాతం జనాభా ఆధారపడి ఉంది. తమ నాలుగేళ్ల పాలనలో 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించామని వెల్లడించారు. వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చి, గ్రామ స్థాయిలో 10,500 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు జగన్.


డీటీబీ ద్వారా లబ్ధిదారులకు రూ. 1,97,473 కోట్లు అందించాం. రాష్ట్రంలో జిల్లాల పెంపుతో సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. సచివాలయాల్లో దాదాపు 600 సేవలు అందుబాటులోకి తెచ్చాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ సేవలందిస్తున్నారు. నిన్నటి కంటే నేడు, నేటి కంటేరేపు బాగున్నప్పుడే అభివృద్ధి అన్నారు. దేశంలో ఎక్కడా లేని దిశ యాప్ తీసుకొచ్చాం. మహిళలు, బాలికలు, యువతుల రక్షణ కోసం ఇప్పటికే దిశ పోలీస్‌ స్టేషన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఇప్పటికే1.36 కోట్ల మంది దిశయాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని సీఎం జగన్ అసెంబ్లీలో తెలిపారు. 



ఇవే నా ఎకనామిక్స్, పాలిటిక్స్.. అవన్నీ కలిపితేనే జగన్
గత ప్రభుత్వాలు గాల్లో మాటలు చెప్పేవాళ్లు అని.. అదిగో మైక్రోసాఫ్ట్ అని చెప్పేవాళ్లు, అదిగో బుల్లెట్ ట్రైన్ అని మాటలు మాత్రం గొప్పగా చెప్పేవాళ్లు అని సెటైర్లు వేశారు. అయితే తన మాట మాత్రం నేల పైనే అని, తన నడక పేదలతోనే అన్నారు. తన యుద్ధం పెత్తందార్లతో యుద్ధం అని, తన లక్ష్యం అని పేదరిక నిర్మూలన అని స్పష్టం చేశారు. తన ఎకనామిక్స్ వేరే అని, పేద కుటుంబాలు బాగు పడితేనే పేద కులాలు బాగు పడతాయని, వారికి అన్ని అందిస్తేనే సమాజం బాగు పడుతుందని, ఇలా అందరు మెరుగైతే రాష్ట్రం సైతం డెవలప్ అవుతుందని నమ్మి పనిచేసి ఫలితాలు చూపించానన్నారు. ఇదే తన ఎకనామిక్స్, తన పాలిటిక్స్ అని, తన తండ్రి నుంచి హిస్టరీ నేర్చుకున్నానని.. ఇవన్నీ కలిపితేనే వైఎస్ జగన్ అని చెప్పగానే సభలో వైసీపీ సభ్యులు జోహార్ వైఎస్సార్, జై జగన్ అంటూ నినాదాలు చేశారు.