జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్టైల్ మార్చారా.. ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నారా.. జనం కనిపించగానే స్టేజ్ పై ఊగిపోయి, ఆవేశంతో తేల్చుకుందాం అని సవాల్ చేసే పవన్ ఈ సారి చాలా కూల్ గా మాట్లాడారు. దీంతో మచిలీపట్నం జనసేన సభలో పవన్ ప్రసంగం తీరుపై చర్చ నడుస్తోంది.
వ్యవస్థాప దినోత్సవంలో జనసేనాని ప్రసంగం..
జనసేన పార్టీ 10వ వ్యవస్థాపక దినోత్సవాన్నిపురస్కరించుకొని మచిలీపట్టణంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు పవన్ కళ్యాణ్. అయితే వేదిక పై పవన్ చేసిన ప్రసంగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి. వేదికపై పవన్ ప్రసంగం, ఆయన హావభావాలపై ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. గతంలో నిర్వహించిన సభల్లో పవన్ ప్రసంగించిన తీరు, ఈ సారి పవన్ ప్రసంగించిన తీరును బేరీజు వేసుకునే పరిస్థితి పొలిటికల్ సర్కిల్ లో కనిపిస్తోంది. పవన్ సభ అనగానే మెదటినుంచి చివరి వరకు గందరగోళంగా నిర్వహించే కార్యక్రమం అని ప్రచారంలో ఉంది. సభ వేదికపై పవన్ మాట్లాతూ ఆవేశంగా వ్యాఖ్యలు చేయటం, తల ఊపేస్తూ, మరో చేత్తో తలపై నుండి ముందుకు పడుతున్న వెంట్రుకలను వెనక్కి తోసుకుంటూ శరీరం మెత్తం ఊపేస్తూ ప్రసంగం సాగేది. దీంతో అభిమానులు కూడా పూనకాలు వచ్చి ఊగిపోయేవారు.
అసలు పవన్ ప్రసంగం అంటేనే తలతోక ఉండదని, ఎక్కడ మెదలు పెట్టి ఎక్కడ ఆపుతారో తెలిసేది కాదన్న వాదన వినిపించేది. ఈ క్రమంలోనే మచిలీపట్నంలో మంగళవారం నిర్వహించిన సభలో పవన్ ప్రసంగించిన తీరు భిన్నంగా ఉందని పొలిటికల్ సెక్టార్ట్స్ లో కామెంట్స్ నడుస్తున్నాయి. వేదిక పై పవన్ చాలా కూల్ గా మాట్లాడటం ప్రధాన అంశంగా చెబుతున్నారు. అంతే కాదు తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పేందుకు పవన్ చాలా ప్రయత్నించారని వినిపిస్తోంది. అక్కడక్కడా గ్యాప్ తీసుకున్నప్పటికి పవన్ తాను అనుకున్న విషయాలను రాసుకొని వచ్చిన పేపర్ లు చదివి మరి స్పష్టంగా చెప్పేందుకు ప్రయత్నించారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
పొలిటిక్స్ పై స్పష్టత వచ్చినట్లేనా..
తాజా రాజకీయ పరిణామాలపై పవన్ సభలో చేసిన ప్రసంగం చాలా విపులంగా జరిగింది. సాధారణంగా పవన్ ప్రసంగం అనగానే ఆద్యంతం అభిమానులు కేరింతలు కొడుతూనే ఉండటం, ప్రసంగానికి అడ్డు తగలటం కామన్ గా కనిపించేది. అయితే ఈసారి అలాంటి వాటిని పవన్ పట్టించుకోనని స్పష్టంగా చెప్పటంతో పాటుగా దాదాపుగా గంటన్నర కు పైగా సాగిన ప్రసంగం పార్టీ కార్యకర్తలను ఆలోచనలో పడేసే ప్రయత్నం చేశారు పవన్. అధికార పక్షాన్ని టార్గెట్ గా చేసుకొని పవన్ ప్రసంగం ఉంటుందని అంతా ఊహించారు. అయితే అందుకు భిన్నంగా పవన్ కులం, మతం వర్గ భేదాలు ఉండకూడదని, తాను అందరివాడినంటూ కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై చాలా తక్కువ గా విమర్శలు చేశారు. ప్రధానంగా ఇసుక, గంజాయి, శాంతి భద్రతలకు సంబందించిన అంశాలను పవన్ కీలకంగా ప్రస్తావించారు. దీంతో వాటిపై అందరి అటెన్షన్ ఉండేలా పవన్ తన ప్రసంగంలో జాగ్రత్తలు పడ్డారని అంటున్నారు.
పొత్తులపై క్లారిటీ ఇచ్చారా....
పవన్ సభ అనగానే చాలా మంది పొత్తుల అంశం పై తేల్చేస్తారని ఎదురు చూశారు. కానీ వచ్చే ఏడాది విజయం సాధించి ఆవిర్భావ దినోత్సవం చేసుకుందామంటూ పవన్ ప్రసంగాన్ని ముగించారు. అదే సందర్భంలో 175సీట్లలో పోటీ చేయాలని అధికార పక్షం నుంచి వచ్చిన డిమాండ్లపై పవన్ క్లారిటీ ఇచ్చారు. జనసేన పార్టీ ఎన్ని స్దానాల్లో పోటీ చేయాలో మీరే చెబుతారా.. మీ పని మీరు చూసుకోండంటూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఇక టీడీపీతో పొత్తు, సీట్లు ఆఫర్ పై పవన్ చాలా క్లారిటీ ఇచ్చారు. పొత్తుల్లో భాగంగా 20 సీట్లు టీడీపీ ఇస్తుందని వాట్సాప్ లలో వచ్చే ప్రచారాలు నమ్మదన్నారు. ఇలా వరుసగా ఒక్కో అంశంపై పవన్ ప్రశాంతంగా ఆలోచించి పేపర్ పై ముందుగా రాసుకొచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగం, గత ప్రసంగాలకు భిన్నంగా జరిగిందని రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జరుగుతోంది.