Pawan Kalyan Biopic: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై బయోపిక్ తీస్తానని ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ అందరు భార్యల పిల్లలతో పాటు మహిళా లోకం అతడికి గుణపాఠం చెబుతారని.. సినిమా వర్క్ మొదలైందన్నారు. కొందరు నటీనటులను సంప్రదించామన్న ఆయన.. నిత్యపెళ్లి కొడుకు, పెళ్లిళ్లు పెటాకులు, తాళి- ఎగతాళి, మూడు ముళ్లు- ఆరు పెళ్లిళ్లు, బహుభార్యా ప్రావీణ్యుడు, MRO (మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్), ‘అయిన పెళ్లిళ్లెన్నో పోయిన చెప్పులు ఎన్నో’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు తమకు మంచి టైటిల్ సూచించినా పరిశీలిస్తామని, ప్రజాధరణ తమకు ముఖ్యమన్నారు. అసలే ఎన్నికలు వస్తున్నాయి, సాధ్యమైనంత త్వరగా పవన్ పై సినిమాను పూర్తి చేస్తామని చెప్పారు. తనను కించపరచాలని బ్రో సినిమాలో ఉద్దేశపూర్వకంగా శ్యాంబాబు పాత్ర క్రియేట్ చేశారని మరోసారి ఆరోపించారు. ఇలాంటి సినిమాలు చూస్తే జనాలు ఆదరించరని, ఇకనుంచి పవన్ సినిమాలు సక్సెస్ అయ్యే ఛాన్స్ లేదని వ్యాఖ్యానించారు. అయితే ఎవర్ని పడితే వార్ని కెలికితే గుణపాఠం తప్పదు అంటూ సినిమా రంగాన్ని అంబటి హెచ్చరించారు.
బ్రో సినిమాలో శ్యాంబాబు అనే పాత్రను పవన్ కళ్యాణ్ దూషించి, కించపరిచేలా క్యారెక్టర్ ను క్రియేట్ చేశారని మంత్రి అంబటి అన్నారు. సినిమా కలెక్షన్లు తగ్గుతున్నాయి కనుక సినిమాపై కాంట్రవర్సీ చేయడంపై మూవీ యూనిట్ ఫోకస్ చేసిందని ఎద్దేవా చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. సినిమాకు 65 నుంచి 70 కోట్లు వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. సినిమాపై ఫోకస్ చేయకుండా, కొందరు వ్యక్తులను టార్గెట్ చేసి సినిమా తీస్తే ఫోకస్ పోయి కమర్షియల్ హిట్ అవ్వదన్నారు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కూర్చుని ఓ సీన్ క్రియేట్ చేసి ఆనందాన్ని పొందుతున్నారని ఆరోపించారు.
వారాహి అమ్మవారిని తన కాలు కింద ఉండేలా వాహనాన్ని తీసుకొచ్చిన రోజే పవన్ కళ్యాణ్ పతనం మొదలవుతుందని గతంలోనే చెప్పానన్నారు. పవన్ రాజకీయంగా సినిమాలు చేస్తే ఓకే, కానీ ఎంటర్ టైన్మెంట్ పేరుతో సినిమాలు తీస్తూ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని క్యారెక్టర్స్ తీసుకురావడం మంచిది కాదని అంబటి సూచించారు. నీతి, నిజాయితీపరుడు పవన్ బ్రో సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో చెప్పాలన్నారు. దీనిపై ఎంత పన్ను చెల్లించారో చెప్పాలని పవన్ ను డిమాండ్ చేశారు.
ఒక్క రోజు రూ.2 కోట్ల పారితోషికం తీసుకునే వ్యక్తి అయితే పవన్ దాదాపు 40 రోజులు షూటింగ్ లో పాల్గొన్నట్లయితే రూ.80 కోట్లు ఆయన తీసుకుని ఉండొచ్చు.. అయితే సూపర్ హిట్ అని చెప్పుకుంటున్న బ్రో సినిమాకు కనీసం పవన్ రెమ్యూనరేషన్ కూడా కలెక్షన్లు రాలేదు అన్నారు. గతంలో చిరంజీవి సైతం కొన్నేళ్లు సినిమాకు దూరంగా ఉన్నారని గుర్తుచేశారు. ఓ సినిమా తీసేటప్పుడు అది పొలిటికల్ మూవీనా, లేక కేవలం వినోదాత్మక సినిమానా చెప్పి అలాగే తెరకెక్కించడం మంచిదన్నారు.
తమిళంలో ఓటీటీలో సక్సెస్ అయిన సినిమాను తెలుగులో బ్రో పేరుతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించగా, సముద్రఖని ప్రత్యేకశ్రద్ధ దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాయగా.. విశ్వప్రసాద్ టీజీ సినిమాను నిర్మించారని చెప్పారు. టీడీపీ, జనసేనకు విశ్వప్రసాద్ ఫండ్స్ ఇస్తున్నారని సైతం రాంబాబు ఆరోపించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial