ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం మాజీ సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన రాళ్ల దాడి ఘటనపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో తమ మనోభావాలను దెబ్బతిన్నాయన్నారు. కనుక చంద్రబాబు, లోకేష్ లు దళితులపై తాము చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ తాము శాంతియుతంగా నిరసన చేపట్టామన్నారు. దళితులకు క్షమాపణ చెప్పి యర్రగొండపాలెంలోకి అడుగు పెట్టాలని డిమాండ్ చేశామని, కానీ టీడీపీ శ్రేణులు తమపై రాళ్ల దాడి చేశాయని ఆరోపించారు. ఇందులో పోలీసుల వైఫల్యం కూడా ఉందని చెప్పారు. 


ఏపీ పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలుపు సురేష్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన తమపై టీడీపీ శ్రేణులు రాళ్లదాడికి పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. కానీ చంద్రబాబు వాహనంపై తాము ఎలాంటి దాడి చేయలేదని, ఈ విషయంపై కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేయడానికి సిద్ధమని మంత్రి సురేష్ అన్నారు. ప్రతిపక్ష నేత అయి ఉండి చంద్రబాబు రూల్స్ కు విరుద్ధంగా రోడ్లపై మీటింగ్ పెట్టడం సరికాదన్నారు. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సభలలో కొందరు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. 


అవసరం లేకున్నా ఇంటి ముందు చంద్రబాబు కాన్వాయ్ ఆపారన్నారు. పైగా వేలు చూపిస్తూ, మీ సంగతి తేలుస్తాం, మీ అంతు చూస్తాం అంటూ వైసీపీ కార్యకర్తలు, నేతలను ఆయన రెచ్చగొట్టిన వీడియోలు తమ వద్ద ఉన్నాయన్నారు. వాస్తవానికి దళితులపై చంద్రబాబు, లోకేష్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని శాంతియుతంగా నిరసన చేపట్టామని.. కానీ ప్రతిపక్షనేత చేసిన వ్యాఖ్యలతో వివాదం ముదిరిందన్నారు. నిన్న జరిగిన రాళ్ల దాడిలో పోలీసుల వైఫల్యం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ శ్రేణుల తరహాలో తాము సహనం కోల్పోతే పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. కానీ తాము మాత్రం శాంతియుతంగా నిరసన తెలిపామన్నారు. 


అసలేం జరిగిందంటే..
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్త  వాతావరణం ఏర్పడింది. యర్రగొండపాలెంలో చంద్రబాబు రోడ్ షో ను అడ్డుకునేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో ఆయన అనుచరులు వచ్చారు. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్ మీదకు వచ్చారు. నల్ల బెలూన్లు, టీ షర్టులు ధరించి.. బాబు గో బ్యాక్ ప్లకార్డులతో నిరసన  చేపట్టారు. స్వయంగా సురేష్ కూడా రోడ్డు మీదకు వచ్చారు. ఆయన చొక్కా తీసేసి నిరసన చేపట్టారు. చంద్రబాబు దళితుల్ని అవమానపర్చారని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం చంద్రబాబు రోడ్ షోలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య రాళ్ల దాడి జరగగా... చంద్రబాబు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.


చంద్రబాబు యర్రగొండపాలెం సభపై కేసు నమోదు 
చంద్రబాబు శుక్రవారం యర్రగొండపాలెంలో నిర్వహించిన సభపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతిలేని ప్రదేశంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారని డీఎస్పీ దాన కిషోర్ కేసు నమోదు చేశారు. చంద్రబాబు పర్యటనలో రాళ్ల వాగు వద్ద బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంటే.. అప్పటికే చీకటిపడుతుండడంతో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు ప్రసగించారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని, అనుమతి తీసుకోకుండా సభ నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు.