Andhra Pradesh Liquor Scam Case | అమరావతి: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో సిట్ అధికారుల చేతికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఇదివరకే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో లిక్కర్ స్కాం సంబంధించి 11 కోట్ల రూపాయల నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నగదు పంపిణీ చేసేందుకు పలు ప్రదేశాలలో డబ్బులు దాచిపెట్టినట్లు సితాధికారులు గుర్తించారు.

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న వీడియో సిట్ చేతికి చిక్కింది. అలా రూపంలో అందిన నగదును వెంకటేష్ నాయుడు అతడి సన్నిహితులు లెక్కిస్తున్నట్లు వీడియోలో ఉంది. నగదును అట్టపెట్టెల్లో సెట్ చేసేందుకు వీలుగా నోట్ల కట్టలను సిద్ధంగా ఉంచినట్లు అర్థమవుతుంది. ఆ వీడియోలో రద్దయిన 2000 నోట్లు, 500 రూపాయల నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి.

డిస్టిలరిస్ కంపెనీల నుంచి వచ్చిన నగదు ని రిసీవ్ చేసుకున్నట్లు వెంకటేష్ నాయుడు వీడియో తీసుకున్నట్లు సీటు గుర్తించింది. దాంతో లిక్కర్ స్కాం కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెవిరెడ్డి చెబుతూ వస్తున్నారు.

ఈ కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహా పలువురు అరెస్ట్ అయ్యారు. సిట్ అధికారులు విచారణలో భాగంగా వెంకటేష్ నాయుడు ఫోన్ వాట్సాప్ నుంచి నోట్ల కట్టలు చెక్ చేస్తున్న వీడియో రిట్రీవ్ చేశారు. ఇటీవల దొరికిన డబ్బుతో తనకేం సంబంధం లేదని మరో నిందితుడు రాజ్ కేసిరెడ్డి అన్నాడు. 

ఫాం హౌస్‌లో అట్ట పెట్టెల్లో నోట్ల కట్టలు

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ మండలం కాచారంలోని సులోచన గెస్ట్‌ హౌస్‌లో ఏపీ సిట్ అధికారులు ఇటీవల నగదును గుర్తించి సీజ్ చేశారు. ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా తెలిసిన సమాచారంతో సిట్ అధికారులు సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్‌లో తనిఖీలు చేపట్టారు. 12 అట్టపెట్టెల్లో దాచి ఉంచిన భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదును లెక్కించగా రూ.11 కోట్లు ఉందని సిట్ అధికారులు తెలిపారు. నిందితుడు వరుణ్‌ పురుషోత్తం వెల్లడించిన విషయాల ఆధారంగా తనిఖీలు చేపట్టిన సిట్ అధికారులు నోట్ల కట్టలు గుర్తించి సీజ్ చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఏ 40గా ఉన్న వరుణ్ పురుషోత్తం దుబాయ్ నుంచి రాగానే  సిట్ అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించింది. అతడు ఇచ్చిన సమాచారంతో తనిఖీలు చేయగా అట్టపెట్టెల్లో దాచిన నోట్ల కట్టల విషయం వెలుగు చూసింది.