AP JAC Amaravati: ప్రభుత్వ ఉద్యోగుల్ని వైసీపీ సర్కారు పట్టించుకోవడం లేదని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చే వరకు ఉద్యోగుల ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం వసతి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొప్పరాజు మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కాంట్రాక్టు, పొరుగు సేవల, విశ్రాంత ఉద్యోగులవి న్యాయపరమైన డిమాండ్లని తెలిపారు. డిమాండ్ల సాధనకై ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో.. మూడో దశ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.


సర్కారు తమ ఉద్యమాన్ని కించపరుస్తుందన్న బొప్పరాజు.. రేపటి (సోమవారం) నుండి మూడో దశ ఉద్యమాన్ని ఉద్ధృతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నాలుగు చోట్ల ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ఏపీ జేఏసీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో మంగళవారం ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు. రెండు దశల్లో ఉద్యోగులు ఉద్యమాలు చేసినా.. రాష్ట్ర సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదని బొప్పరాజు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను పూర్తి వదిలేశారని.. సమయానికి జీతాలు కూడా ఇవ్వడం లేదని బొప్పరాజు మండిపడ్డారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడి పని చేస్తున్న ఉద్యోగులను, వారి కుటుంబాలను వైసీపీ సర్కారు కష్టపెడుతోందని అన్నారు. 60 రోజులుగా ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక్కో ఉద్యోగికి లక్షల రూపాయలు రావాల్సి ఉందని, వారికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. చర్చల పేరుతో ఉద్యోగులను పిలిచి.. అవమానిస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితి సర్కారు ఎందుకు వచ్చిందని ప్రశ్నలు గుప్పించారు.


రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందా...? 
రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందన్న ప్రభుత్వ వాదనపై ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్త చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకే రూ. 90 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి  చెప్పడం దారుణమని  బొప్పరాజు వెంకటేశ్వర్లు   విమర్శించారు. మంగళవారం ఆయన కాకినాడ లో  ఉద్యోగులు నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్నారు.  వాలంటీర్ల జీతాలతో పాటు ఏపీ ఉద్యోగులకు చెల్లించే మొత్తం రూ.60 వేల కోట్లకు మించి ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పటికైనా ఉద్యోగులందరూ నిర్లక్ష్యం వహించకుండా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమంలో పాలుపంచుకోవాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపిచ్చారు.


ఉద్యమించకుంటే ప్రతి ఉద్యోగి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే జీతాలు సరైన సమయానికి పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనెల 28న రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో నిర్వహిస్తున్నామని, అందరూ హాజరు కావాలని కోరారు. ఇతర ఉద్యోగ సంఘాలు కలిసి రాకపోయినా బొప్పరాజు మాత్రం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారు.  ఉద్యోగుల మలిదశ ఉద్యమం ఓర్పుతో సాగుతోందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని స్పష్టం చేశారు