టికెట్ ధరల విషయంలో మల్టిప్లెక్స్ థియేటర్లకు ఏపీ హైకోర్టు కాస్త ఊరట కలిగించింది. సినిమా టికెట్ ధరలను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రాథమికంగా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే టికెట్ల విషయంలో సర్వీసు చార్జీలను వసూలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, సర్వీసు ఛార్జీలను టికెట్ ధరల్లో కలపడానికి మాత్రం హైకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. మొత్తానికి పాత విధానంలోనే టికెట్ల అమ్మకాలు సాగించవచ్చని వెల్లడించింది. అసలు సినిమా టికెట్ల నిర్ణయంపై అధికారం సంబంధిత లైసెన్సింగ్ అథారిటీ అయిన జేసీదేనని పేర్కొంది. ఈ వ్యవహారం మొత్తాన్ని లోతుగా చూడాల్సి ఉందని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని వెల్లడించింది. న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
ఆన్‌లైన్ టికెట్ విధానం ద్వారా నిధులు దుర్వినియోగం అవుతాయని ఆందోళన అవసరం లేదని తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ ఈ పిటిషన్‌పై విచారణను జూన్ 15కి వాయిదా వేసింది.
అసలు ఏం జరిగిందంటే..
మల్టీఫ్లెక్స్‌లు విధించే సర్వీస్ చార్జీలను సినిమా టికెట్లలో చేరుస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న జారీ జీవో నెంబరు 13ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దానిపై థియేటర్ల యాజమాన్యాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఆ జీవోను, ప్రభుత్వ తీరును సవాలు చేసిన మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టికెట్ల ధరలకు సంబంధించి ప్రభుత్వ జీవోపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే.. మల్టిప్లెక్సులు కల్పిస్తున్న సౌకర్యాలకు వసూలు చేసే సర్వీసు చార్జీలను టికెట్ల ధరల్లో కలపడానికి కుదరదని అన్నారు.
తాము కల్పిస్తున్న సర్వీసులకు తగ్గట్లుగా అందుకు తగ్గట్లు ఛార్జీలు వసూలు చేసుకొనే వెసులుబాటు పూర్తిగా థియేటర్ల పరిధిలోనే ఉండాలని వారు వాదించారు. అంతేకాక, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలను భాగస్వాములను చేయలేదని గుర్తు చేశారు. కనీసం వారిని సంప్రదించకుండానే కమిటీ ఏర్పాటయిందని వాదనలు వినిపించారు. సాధారణ థియేటర్లతో పోల్చితే మల్టీప్లెక్స్ థియేటర్లలో విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి కాబట్టి.. యాజమాన్యాలను సంప్రదించకుండా ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై ఓ ప్రభుత్వం తనకు తానే ధరలు ఖరారు చేయడం సరికాదని వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. సర్వీసు చార్జీలను టికెట్ ధరల్లో చేర్చే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హైకోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది.