బియ్యానికి బదులు నగదు ఇచ్చే పథకంపై ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఖండించారు పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కేంద్రం సూచనలతోనే ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని ఇందులో మతలబు ఏమీ లేదన్నారాయన.
రేషన్ బియ్యానికి బదులు నగదు బదిలీ చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటింటి సర్వే చేస్తోంది. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పేద ప్రజలకు నోటి కాడి కూడును లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్రై చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కచ్చితంగా ప్రభుత్వం సమధానం చెప్పాలంటూ కొన్ని రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు.
బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే నగదు బదిలీ పథకం అమలుకు చర్యలు తీసుకంటున్నట్టు వివరించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ పథకాన్ని అమలు చేయాలని 2017లోనే కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసిందన్నారు. ఆరోగ్య రీత్యా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బియ్యాన్ని వాడరని, జొన్నలు, రాగులు, ముడి బియ్యానికి ప్రాధాన్యత ఇస్తుంటారన్నారు. ఈ పరిస్థితుల్లోనే ఈ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు.
చండీఘర్, పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలిలో ఇప్పటికే ఈ పథకం అమల్లోకి వచ్చిందన్నారు కారుమూరి. రాష్ట్రంలో ఈ నగదు బదిలీ పథకం అమలు కోసం కేవలం సర్వే మాత్రమే జరుగుతుందని, బియ్యం రేటు ఖరారు కాగానే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు పర్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
రేషన్ బియ్యం తీసుకోవాలా... డబ్బులు తీసుకోవాలా అనేది పూర్తిగా లబ్ధిదారుడి ఇష్టమని వివరించారు మంత్రి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ బలవంతమేమీ లేదన్నారు. ఒకసారి రేషన్ బియ్యం తీసుకోకుండా డబ్బులు తీసుకుంటే తర్వాత ఇష్టం లేదనుకుంటే మళ్లీ రేషన్ బియ్యం తీసుకోవచ్చని వివరించారు. ఇలా బియ్యానికి బదులు నగదు తీసుకున్నంత మాత్రాన రేషన్ కార్డు రద్దైపోదని..దీనిపై ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఏడాదికి రెండుసార్లు అంటే.. జూన్, డిసెంబర్‌లో దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. అ టైంలో ఎవరైనా అర్హులు ఉంటే కచ్చితంగా దరఖాస్తు చేసుకుంటే కార్డు వస్తుందని తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో పౌరసరఫరాల కార్పొరేషన్ ఎం.డి. వీరపాండ్యన్ కూడా పాల్గొన్నారు. ఖరీప్ పంట ధాన్యాన్ని గతేడాది నిర్ణయించిన ధరలకే మిల్లర్లకు రవాణా చేసుకోవచ్చని కేంద్రం అనుమతించినట్టు వివరించారు. రైతుల పండించిన మొత్తం పంటను కొంటామన్నారాయన. ఇప్పటికే లక్షా 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు తెలిపారు.