అమరావతి పరిధిలో ఆర్ - 5 అనే జోన్ ఏర్పాటు విషయంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆర్-5 జోన్ పేరుతో రాజధాని పరిధిలో బయటి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని హైకోర్టులో రైతులు సవాలు చేశారు. అయితే, రాజధానిలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంపై ప్రభుత్వానికి తొందర ఎందుకని పిటిషనర్‌లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లారు. అయితే, టిడ్కో ఇళ్ళ వ్యవహారంలో ప్రభుత్వం, పిటిషనర్లు ఎలాంటి వివరాలు అందజేయకపోవడంతో.. రాజధాని పరిధిలో నిర్మించిన 5 వేల టిడ్కో ఇళ్ళ లబ్ధిదారుల వివరాలు, ఇళ్ళ మంజూరుకు అనుసరించిన విధానాలకు సంబంధించి పూర్తి నివేదికను ధర్మాసనానికి సమర్పించాలని హైకోర్టు సూచించింది. ఆ తర్వాత వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని ఇరు వర్గాలకు హైకోర్టు సూచించింది. దీనిపై విచారణను రేపటికి (మే 2) కి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేద వారికైనా రాజధాని అమరావతిలో 1,134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు (550.65ఎకరాలు), ఎన్టీఆర్ (583.93 ఎకరాలు) జిల్లా కలెక్టర్లకు భూబదలాయిపు కోసం సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఈ ఏడాది మార్చి 31న జీవో 45 జారీ చేశారు. ఆ జీవోను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత రైతులు యు. శివయ్య, కె.రాజేశ్, బెజవాడ రమేశ్ బాబు, ఆలూరి రాజేశ్, కుర్రా బ్రహ్మ, కట్టా రాజేంద్రవర ప్రసాద్ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఆయా పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది.