AP News: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఉన్నతాధికారుల బదిలీలను బాగా చేపడుతోంది. తాజాగా మరోసారి ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ శుక్రవారం (జూన్ 28) సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ముగ్గురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కీలకమైన సీఐడీ చీఫ్‌గా విశాఖ పట్నం పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్‌ను నియమించింది. ఇప్పుడు సీఐడీ ఇన్‌ఛార్జ్ చీఫ్‌గా ఉన్న హరీష్ కుమార్‌ను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగించనున్నారు.
ప్రస్తుతం ఏపీఎస్‌పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్ సింగ్‌ను ఏసీబీ డీజీగా నియమించింది. విశాఖ సీపీగా ఉన్న రవిశంకర్ అయ్యన్నార్‌ను సీఐడీ అదనపు డీజీగా, అలాగే.. శాంతిభద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చిని విశాఖ సీపీ గా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే చంద్రబాబు పాలనాపరమైన ప్రక్షాళన మీద ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు శాఖలకు సంబంధించిన అధికారులతో వరుస సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే దఫదఫాలుగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ వస్తున్నారు. తాజాగా సీనియర్ ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.