ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం తెరపైకి తెస్తుంది. ఇంటింటికీ తిరిగి చేపలు, పీతలు, రొయ్యలు లాంటి సీ ఫుడ్ అమ్మేలా మొబైల్ ఫిష్ వాహనాలను రెడీ చేస్తుంది. దానికోసం ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని వాహనాలు ఇప్పటికే సిద్ధం అయ్యాయి. అర్హులైన మత్స్య కారులకు ప్రభుత్వం వీటిని అందించనుంది. అయితే ముందుగా ప్రభుత్వ ఆమోదం కోసం తయారు చేసిన ఫిష్ వెహికల్స్‌ని ఏపీలో ట్రయల్ రన్ చేస్తున్నారు. ఒకసారి వీటికి ప్రభుత్వ ఆమోద ముద్ర పడగానే రాష్ట్రంలో ఈ జగనన్న మొబైల్  చేపల మార్కెట్లు రోడ్డెక్కనున్నాయి. 


ఉపాధి అవకాశాలుగా చేపలు, మటన్ అమ్మకాలు చేస్తారా అంటూ గతంలో ఈ పథకంపై విపరీతమైన ట్రోలింగ్ నడిచిన విషయం తెలిసిందే. దాంతో ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టిన ప్రభుత్వం తాజాగా ఫిష్ ఆంధ్రా పథకాన్ని మాత్రం పట్టాలెక్కించేందుకు సిద్ధం చేస్తుంది. చేపలు, రొయ్యలు, పీతల వంటి సీ ఫుడ్ అమ్మకాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని సర్కార్ పట్టుదలగా ఉంది. ఆసక్తి గల యువతకు వీటిని అందించడానికి యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దానికోసం సబ్సిడీలను సైతం లబ్దిదారులకు అందించబోతుంది. మరోవైపు, ఈ జగనన్న చేపల వాహనాల వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందన్న సంప్రదాయ మత్స్యకార వ్యాపారులకు ప్రభుత్వం ఎలా సర్దిచెబుతుందో చూడాలి. ఏదేమైనా రానున్న రోజుల్లో ఫిష్ ఆంధ్ర పేరుతొ జగనన్న మొబైల్ ఫిష్ మార్కెట్లు రోడ్లపైకి రావడం మాత్రం ఖాయంగా కనపడుతుంది.


ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఆక్వా రైతులకు మార్కెటింగ్ నిర్వహించడానికి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి జగన్ సర్కార్ సరికొత్త కార్యక్రమానికి కొద్ది రోజుల క్రితమే ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఆక్వా హబ్ ను ఏర్పాటు చేసి, ఈ వెహికల్స్ ద్వారా, మినీ ఫిష్ అవుట్ లెట్‌లను ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు అండగా ఉండాలని, వారు ఉత్పత్తి చేసిన చేపలను మార్కెటింగ్ చేసి, ఆక్వా రంగం కుదేలు కాకుండా కాపాడాలని గతంలో వెల్లడించింది.


అయితే, మత్స్యకారులను ప్రోత్సహించడం, మత్స్య పరిశ్రమ రంగానికి ఊతం ఇవ్వడం కోసం చేప పిల్లలను పంపిణీ చేయడం, ఆక్వా రంగానికి చేయూతనివ్వడం అన్ని రాష్ట్రాలు చేసే పని. తెలంగాణలో కూడా ఇదే విధానం అమలు అవుతోంది. అయినా మత్స్య పరిశ్రమలో ఉన్న రైతులు ఉత్పత్తి చేసిన చేపలను మార్కెటింగ్ చేయడం కోసం జగన్ సర్కార్ మాత్రమే ఇలా ప్రత్యేకమైన దృష్టి సారించింది. పోషక విలువలు ఎక్కువగా ఉండే చేపలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నడుం బిగించింది. ఆక్వా రైతులు సాగు చేసే స్వచ్ఛమైన చేపలు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తే ప్రజల్లోనూ చేపలపై ఆసక్తిని పెంపొందించడం సాధ్యమవుతుందని జగన్ సర్కార్ భావిస్తుంది.