ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మొత్తానికి ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పాలన మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్చి 3 వరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు, ఇతర వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వీటిని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మార్చి 4 నుంచి 10 వరకూ కమిటీ అధికారులు జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలను పరిశీలించి.. అనంతరం మార్చి 11 నుంచి 14 వరకు సీఎస్ ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీ కూడా ఈ అభ్యంతరాలను పరిశీలించనుంది. ఆ తర్వాత మార్చి17న తుది నోటిఫికేషన్ జారీ చేసి.. మరుసటి రోజే గెజిట్ నోటిషికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 23 నుంచి 25 వరకూ ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లాల ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
అభ్యంతరాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ప్రణాళిక శాఖ కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ), అన్ని జిల్లాల కలెక్టర్లు ఉంటారు. ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులు, అభ్యంతరాలను కలెక్టర్లు సేకరిస్తారు. సలహాలు, సూచనలు, అభ్యంతరాలను జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక వెబ్ సైట్ అయిన drp.ap.gov.inలో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఈ విజ్ఞప్తులను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలిస్తుంది. సహేతుకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటులో మార్పులు, చేర్పులు, సవరణలు ఉంటే ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఒకవేళ, విజ్ఞప్తులు అసమంజసంగా ఉన్నట్టు అనిపిస్తే తిరస్కరించాలని రాష్ట్రస్థాయి కమిటీ సూచిస్తుంది. ఈ కమిటీ చేసిన సిఫార్సులపై అంతిమ నిర్ణయం మాత్రం సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీదే ఉంటుంది.
రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 13 జిల్లాలు ఉండగా, కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పడనున్నాయి. మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త జిల్లాల బిల్లు ప్రవేశపెడతారు. ఈ జిల్లాల విభజన తర్వాత అన్ని జిల్లాల స్వరూపం మారిపోతోంది. ప్రకాశం జిల్లా పెద్ద జిల్లాగా మారనుంది. విశాఖ చిన్న జిల్లా కానుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. 14,322 చదరపు కి.మీ. విస్తీర్ణంతో ప్రకాశం అతి పెద్ద జిల్లాగా అవతరించనుంది. 928 చదరపు కి.మీ. విస్తీర్ణంతో విశాఖపట్నం అతి చిన్న జిల్లాగా ఉండనుంది. జనాభా పరంగా చూస్తే కర్నూలు 23.66 లక్షల జనాభాతో పెద్ద జిల్లా అవుతుంది. అతి తక్కువగా 9.54 లక్షల జనాభాతో అరకు చిన్న జిల్లాగా ఉంటుంది.