వాణిజ్య ప్రాంతాల్లో రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఖాళీ స్థలాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. లీజుపై ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం రోడ్లు, భవనాలు, జాతీయ రహదారులు, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో రోడ్లు, భవనాల నిర్వహణ పనుల ప్రగతి సమీక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఖాళీ స్థలాలు ఎన్నో ఉన్నాయని, అవి అన్యాక్రాంతానికి గురికాకుండా ఉండేందుకై వాటిని సత్వరమే వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు దాడిశెట్టి రాజ. విజయనగరం, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భవన నిర్మాణాలను ఇప్పటికే చేపట్టామన్నారు. అదే తరహాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా భవన నిర్మాణాలు చేపట్టేవా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలా కాని పక్షంలో ఆయా స్థలాలను లీజుపై వినియోగించుకునే విధంగా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్నారు. తద్వారా రోడ్లు, భవనాల ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించుకనే అవకాశాలు ఏర్పడతాయన్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రగతిలో ఉన్న రోడ్ల పనులను వేగవంతం చేయాలని, వాటి నాణ్యతలో ఎటువంటి రాజీలేకుండా చూడాలని అధికారులను మంత్రి దాడిశెట్టి రాజ ఆదేశించారు. ప్రగతిలోనున్న రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తాను స్వయంగా పర్యటిస్తానని అధికారులకు మంత్రి తెలిపారు. తమ పర్యటన ప్రారంభమయ్యేలోపు ఇంజనీరింగ్ అధికారులు అంతా క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. రోడ్ల మరమ్మత్తు, నిర్వహణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
కాలపరిధిని పెంచకుండా ఒప్పందం ప్రకారం పి.హెచ్.సిల నిర్మాణ పనులను సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు మంత్రి రాజ సూచించారు. రోడ్లు, భవనాల శాఖకు చెందిన అతిథి గృహాలకు చాలా చోట్ల సెక్యూరిటీ లేకపోవడంతో వాటి నిర్వహణ అధ్వానంగా తయారైందన్నారు. అవుట్ సోర్సింగ్పై వాచ్మెన్లను, అటెండర్లను నియమించుకునేందుకు ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి సర్య్కులేట్ చేయాలని అధికారులను ఆదేశించారు.
రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లులను సి.ఎఫ్.ఎం.ఎస్.లో అప్లోడింగ్ చేయడంలో చాలా జాప్యం జరుగుతోందన్నారు మంత్రి రాజ. ఈ జాప్యాన్ని నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా బిల్లుల అప్ లోడింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. సాంకేతిక సిబ్బంది కొరత వల్ల పూర్తయిన రోడ్ల పనులకు సంబంధించిన ఫీల్డ్ మెజర్మెంట్ పనులు మందకొడిగా సాగుతున్నాయన్నారు. గ్రామ సచివాలయాల్లోని సాంకేతిక సిబ్బంది సేవలు ఇందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. అలా ప్రభుత్వ అనుమతి పొందేందుకు ఫైల్ సర్క్యులేట్ చేయాలన్నారు మంత్రి.
రోడ్లు, భవనాల శాఖలో ప్రత్యేకించి రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి దాదాపు 2 వేల కేసులు కోర్టులో ఎంతో కాలం నుంచి అపరిష్కృతంగా ఉండటాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. ఆ కేసుల సత్వర పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ప్లీడర్కు అదనంగా మరో ప్లీడర్ను నియమించుకునేందుకు అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతించాల్సినదిగా కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెంటనే పంపాలని అధికారులకు మంత్రి సూచించారు.