AP Capital Supreme Court :  రాజధాని కేసులు  తక్షణమే విచారించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.  ఈ మేరకు వెంటనే మెన్షన్ లిస్ట్‌లో చేర్చాలంటూ రిజిస్ట్రారుకు సుప్రీంకోర్టులోని అడ్వకేట్ ఆన్‌రికార్డ్స్ మెహఫూజ్ నజ్కీ   లేఖ పంపారు. ఈనెల 6న మెన్షన్ లిస్ట్‌లో చేర్చాలని రిజిస్ట్రారును నజ్కీ అభ్యర్థించారు.  రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ వ్యాజ్యంలో నవంబర్ 28న జరిగిన విచారణలో ఈ ఏడాది జనవరి 31కి వాయిదా పడింది. అయితే 31న బెంచ్ సమావేశం కాకపోవడంతో విచారణ జరగలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్‌ పిటీషన్‌ను ఈనెల 6న మెన్షన్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వెంటనే అవకాశం ఇవ్వాలని రిజిస్టారును ప్రభుత్వ న్యాయవాది కోరారు. 


వాస్తవానికి ఈ కేసు ఏడో తేదీన విచారణ జరగనుంది. అయితే ఒక్క రోజు ముందుగా.. ఆరో తేదీ ఉదయమే విచారణ చేపట్టాలని లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.   రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటీషన్లపై తదుపరి విచారణను కిందటి నెల 31వ తేదీన చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఆ రోజున బెంచ్ మీదకు రాలేదు.  లిస్టింగ్ కాలేదు. పీఎం కేర్స్, ఎలక్టోరల్ బాండ్స్.. వంటి కీలకమైన పిటీషన్లు ఆ రోజున లిస్టింగ్ అయ్యాయి. ఫలితంగా మూడు రాజధానుల వ్యవహారాన్ని లిస్టింగ్ చేయలేదు. 


తదుపరి విచారణ ఏడో తేదీన జరుగుతుందని సుప్రీంకోర్టు వెబ్ సైట్‌లో పేర్కొన్నారు.  మస్తాన్ వలీ అనే  వ్యక్తి కూడా ఏపీ రాజధాని అంశంపై మరో పిటిషన్ దాఖలు చేశారు. శివరమకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం రాజధాని ఖరారు చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ  పిటీషన్ ను కూడా కలిపి విచారణకు స్వీకరించనుంది. ఏపీ రాజధాని నగరాన్ని నిర్ధారించే విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని, దీన్ని అమలు చేయాలంటూ మస్తాన్ వలీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పైనా ఒకే సారి విచారణ జరగనుంది. 


మూజు  రాజధానుల అంశం ఏపీలో రాజకీయంగా కలకలం రేపుతోంది. గత గత ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా అమరావతిని ఖరారు చేసింది. ప్రస్తుత సీఎం జగన్ అప్పట్లో ప్రతిపక్ష నేతగా .. అమరావతిని స్వాగతించారు. ఎన్నికల ప్రచారంలోనూ అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత  మూడు రాజధానులని ప్రకటించారు. ఇప్పుడు విశాఖ రాజధానిగా చెబుతున్నారు. 29వేల మంది రైతుల భవిష్యత్ తో సుప్రీంకోర్టు తీర్పు ముడి పడి ఉండటంతో...  అందరి దృష్టి సుప్రీంకోర్టు వైపు ఉంది. ప్రభుత్వ విజ్ఞప్తికి సుప్రీంకోర్టు స్పందిస్తుందా లేదా అన్నది సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.