AP Employees Association Complaint on Transfer of Teachers Act : ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా పాఠశాల విద్యాశాఖలో టీచర్ల బదిలీ చట్టం చేయడంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సంఘం ఫిర్యాదు చేసింది. కోడ్‌ ఉండగా పాఠశాల విద్యాశాఖలో టీచర్ల బదిలీ చట్టం చేస్తామంటూ కొందరు అధికారులు ప్రతిపాదించడంపై సీఈవోకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సీఈవోకు ఫిర్యాదు చేశారు.


కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు 
ఎన్నికల కోడ్‌ ఉండగా ఈ తరహా చర్యలకు పాల్పడేందుకు సిద్ధపడడం పట్ల ఉద్యోగుల ఐక్య వేదిక అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ సీఈవోకు ఫిర్యాదు చేశారు. విద్యాశాఖలో బదిలీ చట్టం చేస్తామంటూ కొందరు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. శాసనసభ కాల పరిమితి ముగిశాక, శాసనకర్తలు లేకుండా అధికారులు చట్టం ఎలా చేస్తారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలపై చట్టానికి ప్రతిపాదించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.


పాఠశాల విద్యాశాఖలో జాయింట్‌ డైరక్టర్‌గా పని చేస్తోన్న మొవ్వా రామలింగం సర్వాంతర్యామిలా వ్యవహరిస్తూ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పరిధి దాటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ చర్య ప్రత్యక్షంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన  అవుతుందని సూర్యనారాయణ ఫిర్యాదులో పేర్కొనగా.. సీసీఏ రూల్స్‌ ప్రకారం పాఠశాల విద్యాశాఖ జేడీపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.