Heat Waves in AP: ఏపీలో ఎండలు మరింత ముదురుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా కాస్తలో కాస్త ఊరట కలిగించిన ఉష్ణోగ్రతలు ఇక రేపటి నుంచి (ఏప్రిల్ 13) ఎగబాకనున్నాయి. ఏపీలో వడగాల్పులు వీయనున్నట్లుగా రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరించింది. శనివారం (ఏప్రిల్ 13) 57 మండలాల్లో వడగాల్పులు, ఆదివారం 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 111 మండలాల్లో వడ గాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు 57 అని తెలిపారు. 


శ్రీకాకుళం 15, విజయనగరం 16, పార్వతీపురంమన్యం 10, అల్లూరిసీతారామరాజు 1, అనకాపల్లి 3, కాకినాడ 5,  తూర్పుగోదావరి 6, విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూర్మనాథ్ తెలిపారు. వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.


ఇక్కడ క్లిక్ చేయండి


శుక్రవారం విజయనగరం జిల్లా జామిలో 41.2°C, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో 40.9°C, నంద్యాల జిల్లా చాగలమర్రిలో 40.8°C, కోనసీమ జిల్లా అయినవిల్లి, వైయస్సార్ జిల్లా ఖాజీపేట, అన్నమయ్య జిల్లా పెద్దమండ్యంలో 40.5°C, తిరుపతి జిల్లా రేణిగుంటలో 40.1°C, కర్నూలు జిల్లా కామవరంలో 40°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే  2 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 22 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.


ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి.  డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ  ఎండీ కూర్మనాథ్ సూచించారు.