AP CS Jawahar Reddy Review Meeting: వరదలను ఎదుర్కొనేందుకు జిల్లాల వారీగా అధికార యంత్రాంగం కష్టపడి పని చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు.
వరదల పై సీఎస్ సమీక్ష...
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ఆరు జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు వీలుగా కంటిన్జెన్సీ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వరద, కరువు పరిస్థితులపై వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న జిల్లాల్లో కంటిన్జెన్సీ ప్రణాళిక అమలుకు సంసిద్ధంగా ఉండాలని, అదే విధంగా అధిక వర్షాల కారణంగా వరి నారుమడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరాకు కూడా తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
పశువులపై ప్రత్యేక శ్రద్ధ..
పశువులకు పశుగ్రాసం సరఫరా చేయడంపై జవహర్ రెడ్డి సమీక్షించారు. మత్స్య, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖలకు సంబంధించి చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ రాష్ట్రంలో ఖరీఫ్ లో మొత్తం 34.39 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 9.22 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారని తెలిపారు. గత ఏడాది ఈ సమయానికి 14.2 లక్షల హెక్టార్లలో పంటలు వేశారని చెప్పారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణం కంటే 20 నుండి 50 శాతం అధిక వర్షపాతం నమోదు అయిందని వివరించారు.
కృష్ణా జిల్లాలో 60 శాతం పైగా అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. కాగా అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మైనస్ 20 నుండి 59 మిల్లీ మీటర్ల తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 20 మీమీ.లు అధిక వర్షపాతం నమోదైందని అన్నారు.
వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు వీలుగా సుమారు 10 వేల క్వింటాళ్ల మినుము, పెసర, కంది, ఉలవ, జొన్న, పొద్దు తిరుగుడు, వేరు శెనగ తదితర విత్తనాలను ఏపి సీడ్స్ వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. అలాగే అధిక వర్షాలతో వరినారు మడులు దెబ్బతిన్న రైతులకు స్వల్ప కాలంలో పంట దిగుబడినిచ్చే ఎంటియు 1121,1153,బిపిటి 5204, ఎన్ ఎల్ ఆర్ 34449, ఎంటియు 1010 రకం వరి విత్తనాలను సుమారు 30 వేల క్వింటాళ్లను సిద్ధం చేసినట్టు స్పెషల్ సీఎస్ గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.
జిల్లాల వారీగా నివేదికలు...
వరదలు, అధిక వర్షపాతంతో పాటుగా వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల నుండి పూర్తి నివేదికలను అందించాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సూచించారు. జిల్లాల వారీగా నమెదయిన వర్షపాతంతో పాటుగా అతి తక్కువ నమోదు అయిన జిల్లాలో కూడా పరిస్దితులను అంచనా వేసి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులను పూర్తిగా ఆదుకునేందుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.