ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం 640 చ.కి.మీటర్లతో కూడిన పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (పిసిపిఐఆర్)ను కలిగి దేశంలో నాల్గవ రాష్ట్రంగా ఉందని పేర్కొన్నారు.

కేంద్ర అధికారుల బృందం తో సీఎస్ భేటీ...

కేంద్ర రసాయన మరియు పెట్రో కెమికల్స్ శాఖ కార్యదర్శి అరుణ్ బరోకతో కూడిన అధికారుల బృందం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యంగా రసాయన, పెట్రో కెమికల్స్ రంగంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు.  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు అవాంతరాలు లేని వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎస్ స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెమికల్ ఇండస్ట్రీ ప్రధాన భాగస్వామి అయ్యేందుకు గల అవకాశాల పై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఏర్పాటు అవుతున్న వివిధ ఇండస్ట్రియల్ పార్కులు, పరిశ్రమల సంబంధిత క్లస్టర్ల గురించి సిఎస్ జవహర్ రెడ్డి కేంద్ర కార్యదర్శి అరుణ్ బరోక బృందానికి వివరించారు. తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో ఎయిర్ కండిషనింగ్ ఉత్పత్తులు తయారీ గురించి వివరించారు. రానున్న రోజుల్లో ఇది భారత దేశానికే ఏసీ మాన్యుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ గా రూపుదిద్దుకోనుందని జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు...

కేంద్ర రసాయన మరియు పెట్రోలికెమికల్స్ శాఖ కార్యదర్శి అరుణ్ బరోక మాట్లాడుతూ.. రసాయన ఉత్పత్తుల తయారీలో భారతదేశం ప్రపంచంలోనే  6 స్థానంలో ఉందని, ఆసియా ఖండంలో 3వ పెద్ద దేశంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో కెమికల్స్ అండ్ పెట్రోకమికల్స్ ఉత్పత్తిలో భారతదేశం వాటా 178 బిలియన్ డాలర్లుగా ఉండగా వచ్చే 2025 నాటికి 300 బిలియన్ డాలర్ల స్థాయికి చేరేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు అరుణ్ బరోక వివరించారు. ఇండియన్ ట్రేడ్ పోర్టల్ ప్రకారం ప్రస్తుతం దేశంలో ఈ రంగంలో 2 మిలియన్ల మంది పని చేస్తున్నారని చెప్పారు. వచ్చే నెలలో జరిగే 3 ఎడిషన్ ఆఫ్ ఇండియా గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్స్(GCPMH)సమ్మిట్లో పాల్గొనవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర కార్యదర్సి అరుణ్ బరోక కోరారు.

విశాఖపట్నం, నెల్లూరుల్లో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CIPET)ఇనిస్టిట్యూట్ లే ఏర్పాటుపై కేంద్ర కార్యదర్శి అరుణ్ బరోక జవహర్ రెడ్డితో విస్తృతంగా చర్చించారు. వీటి ఏర్పాటుతో ఈ రంగంలో మరింత నైపుణ్యాభివృద్ది చేయడంతో పాటు సాంకేతిక సహాయం అందించేందుకు అన్నివిధాలా అవకాశం కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న వనరులను వినియోగించుకొని మరింత ఉన్నస్దితికి చేరుకునేందుకు ఉన్నఅవకాశాల పై కూడా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరం అయిన సహాకారాన్ని కేంద్రం నుండి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని సెంట్రల్ టీం హామీ ఇచ్చింది.  త్వరలో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగే సమావేశాల్లో మరిన్ని వివరాలను గురించి చర్చించేందుకు అంగీకారం తెలిపారు.