Short Film Contest : టీడీపీ నేత నారా లోకేష్ ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటున్నారు. ఓ వైపు పాదయాత్రలో పాల్గొంటూనే మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేస్తున్నారు. ఆయన పాదయాత్రలో ఉన్నా కూడా తెలుగుదేశం సైనికులు, తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది మంగళగిరి తెలుగుదేశం పార్టీ. ఇటీవలే ఆయన పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. అయితే మంగళగిరిలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను ప్రపంచానికి పరిచయం చేసే విధంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. మంగళగిరిలో జరుగుతోన్న సేవా కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ను నిర్వహించనుంది. ఆ కాంటెస్ట్ కు సంబంధిచిన వివరాలను ఓ ప్రకటనలో తెలిపింది పార్టీ.
మంగళగిరి సేవా కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్..
టీడీపీ నేత నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతున్న సేవా కార్యక్రమాలపై ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ను నిర్వహించనుంది పార్టీ. ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కు సంబంధించిన వివరాలను ఇటీవలే ప్రకటించింది పార్టీ. ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో పాల్గొనాలనుకునే వారు వారి ఎంట్రీలను జూన్ 13 నుంచి 30 వ తేదీలోపు మంగళగిరిలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఉచితంగా నమోదు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు తీయబోయే షార్ట్ ఫిల్మ్ ను కంప్లీట్ చేసుకొని ఆ లింక్ లను ఆగష్టు 13 వ తేదీలోపు టీడీపీ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ నిడివి 5 నిమిషాల కన్నా ఎక్కవ ఉండకూడదని తెలిపారు. షార్ట్ ఫిల్మ్ థీమ్ కి కావాల్సిన అన్ని వివరాలు రిజిస్ట్రేషన్ సమయంలో టీడీపీ కార్యాలయంలో అందిస్తారని వెల్లడించారు.
ఆకర్షీణీయమైన బహుమతులు కూడా..
ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో గెలిచిన వారికి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.30 వేలు ఇవ్వనున్నారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి తగిన అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. అంతే కాకుండా సోషల్ మీడియా వేదికలపై ఎక్కువ వ్యూస్ వచ్చిన మొదటి మూడు షార్ట్ ఫిల్మ్ లకు రూ.50, రూ.30 వేలు, రూ.20 వేలు అందజేస్తామని పేర్కొన్నారు. ఇవి కాకుండా ఓ మూడు షార్ట్ ఫిల్మ్ లను ఎంపిక చేసి కన్సోలేషన్ బహుమతి కింద రూ.10 వేలు అందజేస్తామని తెలిపారు.
మంగళగిరిలో గెలుపే లక్ష్యంగా నారా లోకేష్..
గత ఎన్నికలతో పోలిస్తే నారా లోకేష్ రాయకీయంగా చాలా యాక్టీవ్ అయినట్టే కనిపిస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్నా నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రాలేదు. 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళగిరిలో పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయినా మంగళగిరిను మాత్రం వదల్లేదు. ఓ వైపు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూనే మరోవైపు మంగళగిరిలో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సమస్యలు, అన్నా క్యాంటీన్లు, ఆరోగ్య సంజీవని రథాలు, స్త్రీ శక్తి కార్యక్రమం, చేనేతలకు సాయం, తోపుడు బండ్లు, ట్రై సైకిల్స్ ఇలా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఏదేమైనా ఈసారి మంగళగిరిలో గెలుపే లక్ష్యంగా నారా లోకేష్ ముందుకు దూసుకెళ్తున్నారు.