AP CRDA construct special building in Quantum Valley : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ** 65వ సీఆర్డీయే (CRDA) అథారిటీ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సాంకేతిక రంగాలకు పెద్దపీట వేస్తూ నిధులను కేటాయించారు. అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా 'క్వాంటం వ్యాలీ'లో అత్యాధునిక పరికరాల కోసం ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించాలని అథారిటీ నిర్ణయించింది. రెండు ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 43,000 చదరపు అడుగుల్లో 103.96 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన టెండర్లను ఖరారు చేయడమే కాకుండా, క్వాంటం వ్యాలీలో మరో రెండు అదనపు భవనాల నిర్మాణాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అమరావతికి భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా చేసేందుకు భారీ పంపింగ్ స్టేషన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. కొండవీటి వాగు, పాలవాగు పనులతో పాటు, గుంటూరు ఛానల్ ద్వారా అదనంగా 4 వేల క్యూసెక్కుల నీటిని బయటకు పంపేలా పంపింగ్ స్టేషన్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి అదనంగా మరో 8,500 క్యూసెక్కుల సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్‌ను 443 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. అలాగే LPS జోన్ 8లో మౌలిక సదుపాయాల కోసం 1,351 కోట్లు మంజూరు చేస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమరావతిలో భారీ ఆసుపత్రి, యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం 60 ఏళ్ల పాటు భూమిని లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 750 కోట్ల రూపాయల పెట్టుబడితో కేంద్రం ఇక్కడ వైద్య సేవలను అందుబాటులోకి తేనుంది. దీనితో పాటు ఐఏఎస్ అధికారుల బంగ్లాల ఇంటర్నల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం 109.52 కోట్లు విడుదల చేయడానికి అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాజధాని ప్రాంతంలోని రైతులకు సంబంధించిన జరీబ్, నాన్ జరీబ్ భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ సమస్యల పరిశీలన కోసం జిల్లా స్థాయి అధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న పలు నిర్ణయాలను కూడా అథారిటీ ఆమోదించింది.