Uniform Civil Code In India: ఉమ్మడి పౌరస్మృతి అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.


ముస్లిం వర్గాలతో సీఎం సమావేశం
ఉమ్మడి పౌరస్మృతి బిల్లు (Uniform Civil Code) పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మైనార్టీ వర్గాలతో సమావేశం అయ్యారు. ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆయా వర్గాలకు చెందిన ప్రతినిధులు జగన్ తో సమావేశానికి హజరయ్యారు. ఉమ్మడి పౌరస్మృతి అంశం పై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రికి మత పెద్దలు వివరించారు. 


మైనార్టీ వర్గాలు ఆందోళన వద్దు...
సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలకు, మైనార్టీలకు తమ ప్రభుత్వం బాసటగా ఉంటుందని అన్నారు. ముస్లింలు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. మైనార్టి వర్గాల మనసు నొప్పించేలా తమ ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు.  ఉమ్మడి పౌరస్మృతి అంశం (UCC) మీద డ్రాఫ్ట్‌  ఇప్పటికీ  రాలేదని జగన్ అన్నారు. అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై  చర్చ విపరీతంగా నడుస్తోందన్నారు. వాటిని చూసి ముస్లింలు పెద్దస్థాయిలో తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.  
ఒక రాష్ట్రానికి పాలకుడిగా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న తాను అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే ఇదే సమయంలో మీరంతా ఇదే  పరిస్థితుల్లో  ఉంటే  ఏం చేసేవారన్నదానిపై  ఆలోచనలు చేసి సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. ముస్లిం ఆడబిడ్డల హక్కుల రక్షణ విషయంలో ముస్లింలే వ్యతిరేకంగా ఉన్నారంటూ పెద్ద ప్రాపగండా నడుస్తోందని చెప్పారు. ఇలాంటి దాన్ని మత పెద్దలుగా  తిప్పికొట్టాలన్నారు. ఒకే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో ఏ తండ్రి అయినా.. ఏ తల్లి అయినా ఎందుకు భేదభావాలు చూపుతారని ప్రశ్నించారు. మహిళలకు సమాన హక్కుల విషయంలో ఏ మాత్రం రాజీలేదనే విషయాన్ని అందరి కలసి స్పష్టం చేద్దామని అన్నారు.  


లా బోర్డులో చర్చ...
భారతదేశం చాలా విభిన్నమైనదని, దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు ఉన్నాయని చెప్పారు. ఒకే మతంలో ఉన్న వివిధ కులాలు, వర్గాలకూ వివిధ రకాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఉన్నాయని పేర్కొన్నారు. వారి వారి మత గ్రంధాలు, విశ్వాసాలు, ఆచరించే సంప్రదాయాల ఆధారంగా వారికి  వారి పర్సనల్‌ లాబోర్డులు ఉన్నాయని, ఏ నియమమైనా ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలనుకున్నప్పుడు నేరుగా ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్‌ లాబోర్డుల ద్వారానే చేయాలన్నారు. ఒకవేళ మార్పులు అవసరం అనుకుంటే, ఈ విషయంలో సుప్రీంకోర్టు, లా కమిషన్‌, కేంద్ర ప్రభుత్వం కూడా అందరూ కలిసి, వివిధ మతాలకు చెందిన సంస్థలను, వారి పర్సనల్‌ లాబోర్డ్స్‌తో మమేకమై,  పర్సనల్‌ లా బోర్డ్స్‌ ద్వారా అవసరం అయిన  మార్పులు పద్దతి ప్రకారం తీసుకోవాలన్నారు.


ఉప ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
ముస్లింలకు నష్టం  కలిగేలా ఉంటే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు  వ్యతిరేకిస్తామని  సీఎం  జగన్ చెప్పారన్నారు, ఉప ముఖ్యమంత్రి  అంజాద్ బాషా. ముస్లింలకు నష్టం  కలిగించే ఎలాంటి  చర్యలను  తీసుకునే  పరిస్థితి ఉండదని  సీఎం  జగన్ స్పష్టం  చేసినట్లు తెలిపారు.