ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రాజకీయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోవాలని మంత్రులకు ఈ మధ్య సూచించిన ఆయన... తను కూడా ఫుల్‌టైం వాటిపైనే ఫోకస్ పెట్టేలా షెడ్యూల్ రెడీ చేస్తున్నారు.  వచ్చే నెల మూడో వారం నుంచి నేరుగా నేతలతో మాట్లాడనున్నారు. 


తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. తెలంగాణాలో ఎన్నికలకు షెడ్యూల్ ఒకట్రెండు నెలల్లో విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముందస్తు అంటూ ఊహాగానాలు ఉండనే ఉన్నాయి. అందుకే అక్కడి పార్టీలు ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి. యాత్రలు, సమావేశాలు అంటూ ప్రతిపక్షాలు ప్రజల్లో ఉండేలా స్కెచ్ వేస్తున్నాయి. దీనికి దీటైన ప్రతివ్యూహాన్ని సిద్ధం చేస్తోంది అధికార పార్టీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌. 


రాజకీయ కోణంలో నిర్వహించాల్సిన కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ షెడ్యూల్ ఖరారయ్యిందని అంటున్నారు. వచ్చే నెల ఆగస్ట్ 15 తరువాత నుంచి జగన్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసన సభ అభ్యర్దులతో సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాలకు సంబంధంచిన జగన్ ప్రత్యేకంగా నివేదికలను కూడా తెప్పించుకున్నారని అంటున్నారు. 


స్వాతంత్య్ర దినోత్సవం తరువాత నుంచి ఫుల్ టైం రాజకీయాలపైనే జగన్ షెడ్యూల్ ఉంటుదని చెబుతున్నారు. ఈలోగా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవహరాన్ని కూడా జగన్ సెట్ చేస్తారని అంటున్నారు. కొందరు శాసన సభ్యులు, పార్టీ పదవుల వలన ఇబ్బంది ఫీల్ అవుతున్నామని ఇప్పటికే జగన్‌కు వివరించారు. 


మీడియా, సోషల్ మీడియా
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మీడియా ప్రభావం అధికంగా కనపడుతోంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మీడియా, సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కలిసే ఛాన్స్ ఉంది. సోషల్ మీడియా రాజకీయాలపై ప్రభావం ఎక్కువగా ఉన్న వేళ ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనే విషయాలపై కూడా చర్చిస్తారట. 


పార్టీ పదవులు- నామినేటెడ్ పదవులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులతోపాటు, ప్రభుత్వ పరంగా ఖాళీగా ఉన్న పదవులు, నామినేటెడ్ పదవులపై సీఎం ప్రత్యేక శ్రద్ద చూపించనున్నారు. ఇప్పటి వరకు కొన్ని సామాజిక వర్గాల వరకే పరిమితమైన కీలక నామినేటెడ్ పదవులను ఎన్నికల సమయానికి ముందు వెనుకబడిన సామాజిక వర్గాలకు అప్పగించనున్నారు. ఒకే సామాజిక వర్గానికి పార్టీలో అందలం ఎక్కిస్తున్నారనే అభిప్రాయాలను కూడా పరిగణంలోకి తీసుకొని ఆఖరి నిమిషంలో ప్రయార్టీ ఉన్న పదవులు అప్పగించబోతున్నారు. పెండింగ్‌లో ఉన్న పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల వ్యవహరాన్ని కూడా క్లియర్ చేస్తారని భావిస్తున్నారు.


పార్టీ కేంద్ర కార్యాలయానికి పెరిగిన తాడికి
ఇప్పటికే ఎన్నికల సందడి పెరిగిపోయింది. దీంతో పార్టీని నమ్ముకున్న వారు తమకు పెండింగ్‌లో ఉన్న సమస్యల పై కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. అలాంటి వారిని రిసీవ్ చేసుకొని, వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించి, సమస్యను పరిష్కరించటం ద్వార ప్రజల్లో సంతృప్తి శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జగన్ పూర్తి స్థాయి రాజకీయాల పై ఫోకస్ పెడుతుండటంతో పార్టీలోని కీలక నేతలు సైతం ఆయా అంశాలపై ఇప్పటికే స్టడీ చేయటం ప్రారంభించారు.