రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా సీఎం జగన్ ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగాననే ఆయన త్వరలో జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు. ముఖ్యమంత్రి పల్లె నిద్ర కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారంలో ఉంది. అటు ఎమ్మెల్యేలు ఇటు మంత్రులకు అసలు రిలాక్స్ అనేదే లేకుండా సీఎం జగన్ బిజీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. వాళ్ల షెడ్యూల్‌తో పాటు సీఎం జగన్ పాలన, పార్టీపై మరింత దృష్టి పెట్టనున్నారు. త్వరలో నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేయనున్నారు సీఎం జగన్.
ప్రతి జిల్లాలో బహిరంగ సభలు, మాటామంతి వంటి కార్యక్రమాలు ఉంటాయి. జిల్లాలో కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో సంక్షేమ పథకాల అమలు. ఇతర పాలన అంశాలపై చర్చించి అప్పటికప్పుడు వచ్చిన సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి పెడతారని పార్టీలో ఇప్పటికే ప్రచారం జోరు అందుకుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అమలు చేస్తూ భారీ ఎత్తున నిధులను జగన్ ప్రభుత్వం బటన్ నొక్కటం ద్వార లబ్ధిదారుల ఖాతాలోకి చేర్చింది. దీన్ని కేంద్రంగా చేసుకొని జగన్ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళి తాము ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఏం చేశాం.. ఇంకా ఏం చేస్తాం.. రాబోయే రోజుల్లో ఇదే సంక్షేమాన్ని మరింతగా ఎలా పెంచుతాం అనే అంశాలు వివరించనున్నారు. దానికి తగ్గట్టుగానే చర్యలను తీసుకుంటోంది పార్టీ. ఇందులో భాగంగానే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ తరువాత మా నమ్మకం జగన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నేరుగా జగన్ రంగంలోకి దిగేందుకు ప్లాన్ వేశారని అంటున్నారు.
జగనన్నకు చెబుతాం వాయిదా
వాస్తవానికి జగన్ సర్కార్ మరో కార్యక్రమాన్ని కూడా తలపెట్టింది. అదే జగనన్నకు చెబుదాం కార్యక్రమం.. అయితే ఇది స్పందన కార్యక్రమానికి అప్ డేట్ వర్షన్. ఈ వారంలోనే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాల్సి ఉంది. అయితే జగనన్న మా నమ్మకం కార్యక్రమం ప్రారంభంలో ఆలస్యం కావటం, ఆ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు బిజిగా ఉండటంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని వాయిదా వేశారు. వచ్చే వారంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జగన్ స్వయంగా గ్రామ స్దాయి లేదా నియోజకవర్గ స్దాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో ముఖ్యమంత్రి జగన్‌తో పాటుగా స్దానిక వార్డ్ వాలంటీర్ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో సమస్య ఏదైనా జగన్‌కు చెబితే అక్కడికక్కడే పరిష్కారం అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
త్వరలో పల్లె నిద్ర...
త్వరలో పల్లెనిద్ర కార్యక్రమానికి కూడా సంసిద్దం అవుతున్నారని, పార్టీ నాయకులు అంటున్నారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటికే పార్టీ శ్రేణులను ముఖ్యమంత్రి జగన్ సిద్దం చేస్తున్నారు. ప్రతి నెలా ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు, జిల్లా కోఆర్డినేటర్లుతో జగన్ సమావేశం కూడా నిర్వహించి, ఎన్నికలకు సిద్దం కావాలని ఆదేశాలు ఇస్తూ పని తీరుపై ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. పని తీరుకు సర్వేలే కొలమానం అని కూడా సీఎం జగన్ స్పష్టం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో తాను బటన్ తొక్కడం ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని ఎలా అందిస్తున్నామో, అదే స్థాయిలో స్థానిక శాసన సభ్యులు ప్రతి గడప టచ్ చేసి వారి సమస్యలు, గురించి అడిగి తెలుసుకొని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెబుతున్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ కూడా పల్లెనిద్ర కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సీఎం జగన్ షెడ్యూల్ మరింత బిజిగా మారే అవకాశం ఉందని అంటున్నారు.