ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న వేళ ఓ ఆసక్తికర కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఈ సాయంత్రం(సోమవారం) ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ ఇచ్చే "ఎట్ హోం" తేనీటి విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. ఒకే కార్యక్రమంలో ఇరువురు అగ్రనేతలు పాల్గొనడంపై ఉత్కంఠ నెలకొంది. ఇద్దరూ ఒకరితో మరొకరు మాట్లాడుకుంటారా, కనీసం పలకరించుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. 


ఒకప్పుడు చంద్రబాబు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిస్తే... రాజకీయాలు ఎలా ఉన్నా, అప్పటికి ఆహ్లాదకర వాతావరణమే ఉండేది. ఇరువురు నేతల మధ్య ఆసక్తికర సంభాషణలు చోటుచేసుకొనేవి. జగన్ హయాంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఉప్పు-నిప్పు అన్నట్లుగానే పరిస్థితులు ఉన్నాయి. గత వారం దిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఇద్దరూ పాల్గొనాల్సి ఉన్నా.. చంద్రబాబు మాత్రమే వచ్చారు. జగన్ అక్కడే ఉన్నప్పటికీ హాజరు కాలేదు. మరుసటి రోజు జరిగిన నీతి అయోగ్ సమావేశంలో మాత్రం పాల్గొన్నారు. కేవలం చంద్రబాబు హాజరవుతున్నారనే జగన్ హాజరు కాలేదని అంతా భావించారు. ఇవాళ(సోమవారం) మాత్రం ఇద్దరు నేతలూ సాయంత్రం రాజ్ భవన్‌కు వస్తున్నట్లు సమాచారం.


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరు అవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ - పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కలుసుకున్నది లేదు. ఇప్పుడు వీరిద్దరూ తొలిసారి కలిసే సందర్భం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అగ్రనేతల కలయికకు రాజ్ భవన్ వేదిక కానుంది. ఈ సాయంత్రం రాజ్ భవన్‌లో మొదలయ్యే ఎట్ హోం కార్యక్రమంపై ఒక్కసారిగా ఆందరిలోనూ ఆసక్తి పెరిగింది. నేతలు రాజకీయాలను పక్కనబెట్టి మాట్లాడుకుంటారా? లేక ఎడమొహం, పెడమొహంగానే ఉంటారా అనేది చూడాలి. 






హేతుబద్ధత లేని సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర ఆర్థిక స్థితిని చిన్నాభిన్నం చేస్తున్నారంటూ తెదేపా, జనసేన కొంతకాలంగా జగన్‌ సర్కారుపై తీవ్రంగా పోరాడుతున్నాయి. శ్రీలంక తరహా పరిస్థితులు తీసుకొస్తున్నారంటూ తెదేపా విమర్శిస్తే, ముందు అధిక వడ్డీలు ఆశచూపి తర్వాత మోసం చేసే పోంజీ స్కీములతో... జనసేనాని పవన్‌ సంక్షేమ కార్యక్రమాలను పోల్చారు. అధికార వైకాపా ఎప్పటికప్పుడు తమ నేతలు, మీడియా ద్వారా గట్టిగా బదులిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇంతలోనే గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారం కాక రేపింది. ఇరుపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణం వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో ముగ్గురు అగ్రనేతలు పాల్గొనే సమావేశం అందరినీ ఆకర్షిస్తోంది.