Chandra Babu Naidu Yoga With Ramdev Baba: సూర్యోదయ వేళ చారిత్రక ఉండవల్లి గుహల సాక్షిగా యోగ గురు రామ్‌దేవ్ బాబా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాసనాలు వేశారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన యోగాంధ్ర ప్రోగ్రామ్‌లో పలువురు మంత్రులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నార. రామ్‌దేవ్‌బాబాతో కలిసి యోగా చేసిన చంద్రబాబు... యోగా మన సంస్కృతి, మన వారసత్వం అని చెప్పుకొచ్చారు. మరోవైపు చంద్రబాబు దేశానికే ఒక విజనరీ లీడర్ అంటూ రామ్‌దేవ్ బాబా ప్రశంసల వర్షం కురిపించారు.  

Continues below advertisement

అమరావతిలో యోగాంధ్ర వైబ్స్ 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  యోగాంధ్ర కార్యక్రమం ఉండవల్లి గుహల వద్ద అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఏడాది  యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే థీమ్‌తో నిర్వహించిన ఈ వేడుకల్లో రామ్‌దేవ్ బాబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Continues below advertisement

సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా బాబాతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల యోగా ప్రక్రియలను, వాటివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి రామ్‌దేవ్ బాబా వివరించారు.

చంద్రబాబు విజనరీ లీడర్- రామ్‌దేవ్ బాబా 

యోగా గురు రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. గత 30 ఏళ్లుగా చంద్రబాబు ఏది అడిగితే మేం అది చేస్తున్నాం. ఆయన దేశంలోనే అత్యంత విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు.

ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా చంద్రబాబు ఏపీని తీర్చిదిద్దుతున్నారని, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాగే పనిచేస్తే  2047 లక్ష్యం ముందే సాకారమవుతుందని బాబా ఆకాంక్షించారు. అమరావతిని  స్విట్జర్లాండ్‌తో పోల్చిన బాబా, ఇక్కడి 40% పచ్చదనం, 60% నిర్మాణాలు ఉండబోయే ప్లాన్ అద్భుతమని చెప్పారు.

సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో కీలక విషయాలు ప్రస్తావించారు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న స్ట్రెస్ గురించి మాట్లాడుతూ, ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత అవసరం అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని, మన ఏపీని త్వరలోనే దేశానికి ఆధ్యాత్మిక రాజధానిగా మారుస్తామని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 31 శాతం పచ్చదనాన్ని ఏకంగా 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, ఇప్పటికే  20 లక్షల ఎకరాల్లో రైతులు కెమికల్ ఫ్రీ సాగు చేస్తున్నారని గర్వంగా ప్రకటించారు. అమరావతి కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు త్యాగం చేశారని, ఇది సామాన్యమైన విషయం కాదని గుర్తుచేశారు.