Andhra Pradesh News | అమరావతి: మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదని, రాజకీయ, మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖలను ఆయన ఖండించారు.

స్త్రీని ఆరాధించే, గౌరవించే సంప్రదాయం మనది..

'ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. స్త్రీని ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం, భారతీయ జీవన విధానం. ముఖ్యంగా తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదనేది స్ఫష్టం అయ్యిందన్నారు' చంద్రబాబు.

 రాజధాని ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. రాజకీయ, మీడియా ముసుగులో జరుగుతున్న వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తన మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీలకు క్షమాపణ చెప్పకపోవడం విచారకరం అన్నారు. 

వారిపై కఠిన చర్యలు తప్పవు

రాజధాని అమరావతిపై విషం చిమ్మే కుట్రలో భాగంగా హద్దులు దాటి మహిళల మనోభావాలను దెబ్బ తీసిన  వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంపై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ మహిళలపై ఉద్దేశ్యపూర్వకంగా చేసిన ఈ వ్యాఖ్యలు మహిళా సమాజాన్నే అవమానించడం దారుణం. మహిళలను కించ పరిచే నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు చంద్రబాబు