AP CM Chandra Babu: స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తు చేస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. సుమారు రెండున్నరేళ్లు తర్వాత సభలో మాట్లాడిన చంద్రబాబు కాస్త ఎమోషన్ అయ్యారు. అనాటి పరిస్థితులు మరోసారి గుర్తు చేశారు. తన ఫ్యామిలీపై అనవసరంగా ఎలాంటి కారణంలేకుండా నోరు పారేసుకున్నారని అన్నారు. 


ఐదేళ్లుగా నీచ రాజకీయాలు చూశామన్నారు చంద్రబాబు. సభలో ప్రశ్నించిన తమ సభ్యులను అసభ్యకరమైన భాషలో తిట్టారని తెలిపారు. చివరకు తన నిరసన తెలియజేసి వెళ్లిపోతామని చెప్పినా మైక్ ఇవ్వలేదని అన్నారు. ఇలాంటి వైసీపీ గెలిచిన నాటి నుంచి మొన్నటి వరకు సభ నడిపిన తీరు ప్రజలు గమనించారన్నారు. 


అసలు రాజకీయాలకే సంబంధం లేని తన కుటుంబాన్ని అవమానించారన్న చంద్రబాబు... అదే విషయంపై శపథం చేశానని అన్నారు. ముఖ్యమంత్రిగానే గౌరవ సభకు వస్తానని చెప్పినట్టు తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ లేని విధంగా కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తన ఆవేదన గుర్తించిన ప్రజలు అఖండ మెజార్టీతో విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. 


ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానని చంద్రబాబు అన్నారు. మరో జన్మ అంటూ ఉంటే కచ్చితంగా తెలుగువాడిగానే పుట్టాలని కోరుకుంటాను అన్నారు. తనకు రాజకీయాల్లో వేరే ఆలోచనలు లేవని... రాష్ట్రాభివృద్ధి ఒక్కటే మార్గమని అన్నారు. అందుకే కేంద్రంతో మాట్లాడుకొని అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామన్నారు చంద్రబాబు .


గత ప్రభుత్వం చేసిన దుశ్చర్యలను ఎండగడుతూనే అప్పట్లో జగన్ చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తూ సెటైర్లు వేశారు చంద్రబాబు. 2019లో తమ పార్టీకి 23 సీట్లు వస్తే బాధపడ్డామన్నారు. 23న ఎన్నికల ఫలితాలు వస్తే దాన్ని వక్రీకరించి ఇది దేవుడు రాసిన స్క్రిప్టు అని అందుకే 23 సీట్లు వచ్చాయని విమర్శలు చేశారు. ఇప్పుడ కూటమికి 164 సీట్లు వచ్చాయి. ఇవి కూడితే 11 అవుతుంది. అమరావతి రైతులు 1631 రోజులు ఉద్యమం చేసి అవి కూడినా 11 వస్తుంది. ఇది కూడా భగవంతుడు స్క్రిప్టేనా అంటూ తాము మాట్లాడబోమన్నారు. ఇలాంటి సభలో ఉండకపోవడం వారి పిరికితనంగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 


ఇవాళ చేసే పని రేపటి ప్రజల భవిష్యత్‌ను నిర్ణయిస్తుందన్నారు. అందుకే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కలతో అందరూ కలిసి పని చేయాలని సూచించారు. చేసే చట్టాలు కూడా పేదరికం లేదని ఆంధ్రప్రదేశ్‌కు శ్రీకారం చుట్టాలని కోరుకున్నారు. అందుకే అయ్యన్న సహకరిస్తారని చెప్పుకొచ్చారు. 


ఇలాంటి వారిపై ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సభ్యులకు సూచించారు. పవన్‌కి కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అన్నారని గుర్తుచేశారు. 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లు గెలిచిన వ్యక్తి అని కితాబు ఇచ్చారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ గెలవాలో నేర్చుకున్న వ్యక్తి అని ప్రశంసించారు. జీవితంలో ఎప్పుడూ చూడని సభ 15వ శాసనసభ అన్నారు. అత్యున్నత సభగా 16వ శాసనసభ ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలతో ఉండాలని ప్రజా ప్రభుత్వంగా ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. ఈ సభలోకి వచ్చిన ఎందరో మహానుభావులను ఆదర్శంగా తీసుకొని నడవాలని సభ్యులకు సూచించారు.