భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఇవాళ తొలిసారిగా సమావేశం కానుంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు సూపర్‌ సిక్స్‌తోపాటు ఇతర సమస్యలు, విషయాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పోలవరం సందర్శించి వచ్చారు. రాజధాని అమరావతిలో కూడా టూర్ చేశారు. ఆర్థిక అంశాలపై కూడా ఆరా తీశారు. అందుకే వీటన్నింటిపై ప్రజలకు ఓ క్లారిటీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. 


వెలగపూడిలోని సచివాలయంలో చాలా రోజుల తర్వాత రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు కీలకమైన ఐదు అంశాలకు ఆమోదం తెలుపుతూ సంతకాలు చేశారు. మెగా డీఎస్సీపై ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు నాలుగువేల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్‌పై సంతకాలు చేశారు. ఈ అంశాలపై మంత్రమండలిలో చర్చించనున్నారు. అనంతరం వాటికి ఆమోదం తెలపనున్నారు  


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని పదే పదే చెబుతున్న ప్రభుత్వం దాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోనుంది. దీనిపై కూడా తొలి మంత్రిమండలిలో చర్చించనున్నారు. భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వాటి అమలుకు సంబంధించిన ఆర్థిక వనరుల లభ్యతపై కూడా చర్చిస్తారని అంటున్నారు. సమావేశం అనంతరం రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రాలను కూడా విడుదల చేసే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు. 


సూపర్‌ 6తో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వాటి అమలుపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నారు. ఈ ఆరు పథకాలు ఎప్పుడు ఎలా అమలు చేస్తారో అన్న విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి విధివిధానాలపై కూడా ఓ ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. 


2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కూడా రూపకల్పన చేయాల్సి ఉంది. వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలువుతున్న హామీలు, ప్రభుత్వ ఖర్చులు అన్నింటిని బేరీజు వేసుకొని బడ్జెట్ రూపకల్పన చేయాల్సి ఉంది. సూపర్ 6 ను కూడా పరిగణలోకి తీసుకొని లెక్కలు వేయాలి. అందుకే నిధుల సమీకరణ మార్గాలు, ప్రజలపై భారం పడకుండా చేయాల్సిన చర్యలను చర్చించనున్నారు. 


గత ప్రభుత్వం హయాంలో చాలా విషయాల్లో కుంభకోణాలు జరిగాయని ప్రభుత్వ పెద్దలే ఆరోపిస్తున్న వేళ వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ముఖ్యంత్రి చంద్రబాబుకు లేఖలు రాశారు. ఇసుక, మద్యం పాలసీలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ టైంలో మంత్రిమండలిలో ఈ అంశాలు ఏమైనా చర్చకు వస్తాయా అన్నది సాయంత్రానికి తేలిపోనుంది.