జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామంట్స్ పై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. కేంద్ర నాయకత్వంతో ఎవరి చర్చలు వారు జరుపుకుంటున్నారని చెప్పారు..


గుంటూరులో ప్రజా చార్జ్ షీట్ కార్యక్రమం...
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై ప్రజా ఛార్జ్ షీట్ కార్యక్రమాన్ని చేపట్టింది. గుంటూరు లోని మార్కెట్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ ప్రజా ఛార్జ్ షీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుండి ప్రభుత్వంపై ఛార్జ్ షీట్స్ వేస్తున్నామన్నారు.
175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఛార్జీ షీట్ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ముఖ్య మంత్రి కాన్వాయ్ ని అడ్డు కున్న ఏపీ బీజేపీ నేతలపై పోలీసులు దాష్టికం ప్రదర్శించారని మండిపడ్డారు. ఈ విధంగా వ్యవహరిస్తే ప్రతి ప్రాంతంలో అడ్డుకుంటామని ఏపీ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు హెచ్చరించారు.


పవన్ వ్యాఖ్యలపై బీజేపీ ఏమంటోంది...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వేదిగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలసి పొత్తులతో ఉమ్మడిగా ఎన్నికల వెళుతున్నామని ప్రకటించిన క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.  పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని కేంద్ర పార్టీ పెద్దలకు తెలియజేస్తాం అన్నారు. తాము బీజేపీతో కలిసి ఉన్నామని ఇప్పటికే పవన్ చాలా సార్లు చెప్పారని , ఈ సారి తెలుగు దేశం పార్టీతో కూడా కలసి పని చేయాలని పవన్ చెప్పటంపై పార్టిలో చర్చ జరిగిన తరువాత పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. కేంద్ర నాయకత్వంతో ఎవరి చర్చలు వారు  చేస్తున్నారని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఏ నిర్ణయం అయినా కేంద్ర  నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, అదే ఏపీ బీజేపీ ఫాలో అవుతుందని వీర్రాజు తెలిపారు.
సహజ వనరుల దోపిడి..
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో సహజవనరుల దోపిడీ జరుగుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. అన్ని అంశాలు పై ఛార్జిషీట్ వేస్తామని ఈ నెల 19వ తేదీన గన్నవరంలో నిర్వహించే సమావేశంలో రాష్ట్ర స్థాయి ఛార్జ్ షీట్ ప్రకటిస్తామని సోము వీర్రాజు వెల్లడించారు.
ప్రభుత్వ అవినీతి, అసమర్థ కార్యక్రమాలను ఎండగడతామని, టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు ఇవ్వకపోవటం అతి పెద్ద అవినీతి కార్యక్రమమని సోము వీర్రాజు అన్నారు. రైతులను సైతం రోడ్డుపై నిలబెట్టారని, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యమని సొము వీర్రాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఆయుష్ ఆసుపత్రిని కట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా జగన్ ప్రభుత్వం కనీసం స్థలం ఇవ్వటానికి సిద్దంగా లేదన్నారు.


నేచురల్ క్యూర్ విధానాలను పూర్తిగా పక్కన పెట్టారని, ఎయిమ్స్ కూడా నీరు ఇవ్వటం లేదని వీర్రాజు ధ్వజమెత్తారు. ప్రభుత్వ అవినీతికి సంబంధించి అన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ముమ్మాటికి అమరావతేనని, రాజధానిలో రూ. 50000 కోట్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేంద్రం ఇచ్చిందన్నారు. ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు చెప్పి ప్యాకేజ్ కి ఒప్పుకున్నారని అన్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పంపిణీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసిందని ఆయన మండిపడ్డారు. రాజకీయాల కోసం ప్రజలను నమ్మించి మోసం చేయటం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.