AP BJP Chief Somu Veerraju: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో భేటీ కావడం తెలిసిందే. చంద్రబాబు, పవన్ భేటీపై ఏపీలో మరోసారి చర్చ జరుగుతోంది. అయితే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో జనసేనాని పవన్ భేటీ అయిన విషయం తనకు తెలియదంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ నేతలు నిజంగానే భేటీ అయ్యారా అంటూ మీడియాను సోము వీర్రాజు అడిగి ట్విస్ట్ ఇచ్చారు.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పాత మంగళగిరిలో మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించేదుకు అన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా‌ సోము వీర్రాజు హాజరయ్యారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో‌ ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిథులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో భేటీ అయ్యారని ప్రస్తావించారు. అవునా... నిజమా ఆ నేతలు ఇద్దరు భేటీ అయ్యారా అంటూ జర్నలిస్టులనే సోము వీర్రాజు ఎదురు ప్రశ్నించారు. మీకు ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు అని సోమువీర్రాజు అన్నారు. బీజేపీ పార్టీ క్రమ శిక్షణ కలిగిన పార్టీ అని, అంశాల వారిగా ముందుకు పోతామే‌‌ కాని రాజకీయ ప్రయోజనాలు ఆశించమని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం తమకు మిత్రుడే అని మరోసారి స్పష్టం చేశారు.






జాతీయ పార్టీ‌ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండి రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న అప్ డేట్స్ కూడా ఆయనకు తెలియదా అని సోము వీర్రాజు వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. నిన్న సాయంత్రం జనసేనాని చంద్రబాబు ఇంటికి వెళ్లి కలసిన సంఘటన తెలియగానే పొలిటికల్‌ హీట్ మొదలైది. వచ్చే ఏడాది ఎన్నికలు కావడంతో పొత్తులపై ఏపీలో గత కొన్ని నెలలుగా భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. జనసేనాని టీడీపీతో ఉంటారని కొందరు చెబుతుంటే, బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి జనసేన దిగుతుందని ప్రచారం జరుగుతోంది. కాగా, హైదరాబాద్ లో ఎవరో ఇద్దరు నేతలు భేటీ అయితే ఏపీకి సంబంధం ఏంటి అన్నది సోము వీర్రాజు అభిప్రాయం అని కౌంటర్ ఇవ్వడం ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనం అని బీజేపీ నేతలు భావిస్తున్నారు.


మరోసారి చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్  
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఏపీలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.  ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పని చేసే అంశంపై వీరిద్దరూ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత ఏపీలో రాజకీయ మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వీరి భేటీ  హాట్ టాపిక్‌గా మారింది.   జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమతోనే ఉన్నారని బీజేపీ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం బీజేపీతోనే ఉన్నామని చెబుతున్నారు కానీ కలిసి పోటీ చేస్తామన్న  విషయంపైనా క్లారిటీ ఇవ్వడం లేదు.


కేంద్ర బీజేపీ నేతలతో మాట్లాడుతున్నారు కానీ రాష్ట్ర నేతలతో సంప్రదించడం లేదు. బీజేపీ ... జనసేనతో మాత్రమే కలిసి  పోటీ చేస్తామని చెబుతోంది. ఈ క్రమంలో  పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ప్రకటిస్తున్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ప్రయత్నిస్తున్నామని ఓట్లు చీలికను అంగీకరించబోమని అంటున్నారు. ఇలాంటి సమయంలో..  జనసేన, టీడీపీ మధ్య సంప్రదింపులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.