ఏపీ అసెంబ్లీలో నేడు మొత్తం ఆరుగురు తెలుగు దేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. తొలుత నలుగురిని, తర్వాత మరో ఇద్దరినీ సస్పెండ్ చేశారు. బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, రామరాజు, అనగాని సత్యప్రసాద్‌లను సభ ప్రారంభం అయిన కాసేపటికి సస్పెండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే జే బ్రాండ్‌లపై విచారణ, జంగారెడ్డి గూడెం సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు పొడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. పొడియం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటానని సభాపతి అప్పటికే హెచ్చరించారు. దీంతో టీడీపీ సభ్యులు తమ తమ స్థానాలవద్ద నుంచి నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ మాట్లాడుతూ ‘సభకు సభ్యులుగా ఉన్న మీరు ప్రశ్నోత్తరాలలో పాల్గొంటారని ఎదురు చూశాం.. మీరు సభ గౌరవాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ సభాపతి నలుగురు టీడీపీ సభ్యులను ఈనెల 25 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


అనంతరం కూడా మరో ఇద్దరిని స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు సాంబశివరావు, గద్దె రామ్మోహన్‌ ను కూడా స్పీకర్ సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీలో వింతగా ప్రవర్తించారంటూ స్పీకర్ వ్యాఖ్యానించారు. సభలో వీరు విజిల్‌ వేయడంతో.. ఈ టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాదను కాపాడాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా వారు వినకపోవడంతో దీంతో ఈ నెల 25 వరకు సస్పెన్షన్‌ వేటు వేశారు. విజిల్‌ వేసిన మిగతా టీడీపీ సభ్యుల్ని ఈ రోజు సభకు సస్పెండ్‌ చేశారు.


సభలో వైఎస్ఆర్ సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బాలినేని శ్రీనివాస్ సమాధానం ఇస్తుండగా టీడీపీ సభ్యులు విజిల్స్ వేశారు. టీడీపీ సభ్యుడు సాంబశివరావు విజిల్‌ వేశారు. దీనిపై సీరియస్‌ అయిన స్పీకర్‌.. సభా మర్యాదను కాపాడాలంటూ వార్నింగ్‌ ఇచ్చారు. అంతకుముందు టీడీపీ సభ్యుల ఆందోళనతో మండలి వాయిదా పడింది. శాసనమండలిలో మద్యపాన నిషేధంపై తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై మంత్రి బుగ్గన వివరణ ఇస్తుండగా సభ్యులు ఆందోళన చేశారు. దీంతో చైర్మన్‌ శాసనమండలిని 10 నిమిషాలపాటు వాయిదా వేశారు.