ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యుల నినాదాలతో మారుమోగింది. నిరుద్యోగం సమస్యపై చర్చించాలని ఇచ్చిన వాయిదా తీర్మానంతో సభ మొదలు పెట్టాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. జాబ్ క్యాలెండర్, జాబ్‌లెస్ క్యాలెండర్ అంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ప్రశ్నోత్తరాలు ముగిశాక తర్వాత వాయిదా తీర్మానంపై చర్చిద్దామని స్పీకర్ చెప్పినా వినకుండా టీడీపీ నేతలు నినాదాలు కొనసాగించారు. జాబు ఎక్కడ జగన్ అంటూ టీడీపీ నేతలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. వెల్ నుంచి స్పీకర్ పోడియం దగ్గర దూసుకెళ్లి టీడీపీ సభ్యులు నిరసన చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
టీడీపీ సభ్యుల తీరుపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. వారు నిరసన చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ సారి వాయిదా తీర్మానం ప్రవేశపెడితే ప్రశ్నోత్తరాలు జరపాలని వారే పట్టుబట్టారని, ఇప్పుడు పద్ధతి ప్రకారం ప్రశ్నోత్తరాలు, తర్వాత బీఏసీ సమావేశం జరుపుదామనుకుంటే దీనికి అడ్డుపడి వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. సభను అడ్డుకోవడానికే టీడీపీ లీడర్లు అసెంబ్లీకి వచ్చినట్లు ఉందని బుగ్గన మండిపడ్డారు.
టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలన్న అంబటి, బుగ్గన
తెలుగు దేశం నేతలు తమ నిరసన అలాగే కొనసాగిస్తున్న మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. ఉద్దేశ పూర్వకంగానే సభను అడ్డుకోవాలని టీడీపీ చూస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. కాబట్టి, వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. అనంతరం మరోసారి మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. సభ సజావుగా కొనసాగాలంటే టీడీపీ నేతలపై ఏదో ఒక చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు.
చంద్రబాబు డుమ్మా, టీడీపీ సభ సాగనివ్వట్లేదు - గడికోట శ్రీకాంత్ రెడ్డి
అంతకుముందు, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని అన్నారు. సభ సమయం వేస్ట్ చేయడానికి టీడీపీ లీడర్లు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అసెంబ్లీకి మాజీ సీఎం చంద్రబాబు మళ్లీ డుమ్మా కొట్టారని అన్నారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు సభను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు.
టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులు: మంత్రి జోగి రమేష్
టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారని మంత్రి జోగి రమేష్ అన్నారు. టీడీపీ సభ్యులు చంద్రబాబు ఆదేశాలతో సభ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ శవ యాత్రను ప్రజలు చేపడతారంటూ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని అన్నారు.
రైతులకు అందించే పథకాల వివరాలపై మాట్లాడిన మంత్రి కాకాణి
అంతకుముందు ప్రశ్నోత్తరాల్లో భాగంగా మంత్రి కాకాణి గోవర్థన్ మాట్లాడారు. ‘‘వ్యవసాయ అనుబంధ సంస్థలు సమగ్రంగా పథకాలను అమలు చేస్తున్నామని, పశువులకు టీకాలు వేసేలా చర్యలు తీసుకున్నాం. లబ్ధిదారుల సామాజిక తనిఖీ చేపట్టడం, వ్యవసాయ యంత్రాలను అందించడం, సూక్ష్మ పోషకాలు అందించడం, వైఎస్సార్ పొలం బడి లాంటి పథకాలతో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాం’’ అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 155 251తో సమస్యలు తెలుసుకుని సలహాలు ఇస్తున్నామని, మొదలైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.