Bopparaju Comments: ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. వచ్చే నెల 5వ తేదీన ఉద్యోగ సంఘాలతో విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి చట్టపరంగా రావాల్సిన డబ్బులనే తాము అడుగుతున్నామని వివరించారు. బకాయిలు చెల్లించాల్సింది పోయి సర్కారు నోటికి వచ్చినట్లుగా కాకి లెక్కలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దాచుకున్న డబ్బులే కాకుండా తమకు చట్టపరంగా రావాల్సిన డబ్బులను కూడా చెల్లించకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. పదవీ విరమణ పొందిన వాళ్లకు గానీ, చనిపోయిన వారికి గానీ ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో తాము ఉద్యమం మొదలు పెట్టినట్లు వెల్లడించారు. మొన్న జరిగిన చర్చల్లో ఇప్పటికే రూ.3 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేశామని ప్రభుత్వం చెబుతోందన్నారు.


అయితే మాటల్లో కాకుండా రాత పూర్వకంగా ఇవ్వమంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఎంత పెండింగ్ లో ఉంది, పీఆర్సీ ఎరియర్స్ ను రిటైర్మెంట్ పే స్కేల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో ఉద్యమం కొనాగించాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 11వ పీఆర్సీలో పే స్కేల్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లోనే ఉదయం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నాయకత్వంతో, పలు శాఖలకు సంబంధించిన సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించుకొని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు.  


ఇటీవల సీఎస్ ను కలిసిన బొప్పరాజు వెంకటేశ్వర్లు


పోరుబాట పట్టిన ఏపీ ప్రభుత్వ  ఉద్యోగ సంఘ నేతలు ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సీఎస్ జవహర్ రెడ్డితో సమావేశం అయింది.  విజయవాడలోని సీఎస్  క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో  ఉద్యోగుల ఆర్ధిక, ఆర్థికేతర అంశాలపై చర్చించారు. చర్చలు జరుగుతున్నప్పటికీ.. గురువారం నుంచి తాము ప్రకటించిన  ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని  ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రకటించారు.  ఉద్యోగుల సమస్యలపై లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకూ ఉద్యమం కొనసాగుతుందని బొప్పరాజు స్పష్టం చేసారు.  సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన ఏపీ జేఏసీ అమరావతి బృందం తమ వైఖరిని స్పష్టం చేసింది.


చర్చల్లో అంగీకరించిన విషయాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలన్న ఏపీ జేఏసీ అమరావతి 


మార్చి 7వ తేదీన జరిగిన చర్చల తర్వాత కూడా ఉద్యమ కార్యాచరణ కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. సీఎస్ జవహర్ రెడ్డితో సమావేశం ముగిశాక మీడియాతో మాట్లాడారు బొప్పరాజు. పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిన్నటి చర్చల సారాంశాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరామని బొప్పరాజు తెలిపారు.   సాయంత్రంలోపు చర్చల మినిట్స్ ఇస్తామని సీఎస్ స్పష్టం చేశారు. సాయంత్రంలోగా మినిట్స్ ఇస్తే.. గురువారం ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.  సాయంత్రంలోగా మినిట్స్ ఇవ్వకుంటే.. ఉద్యమ కార్యాచరణ యధావిధిగా జరుగుతుందన్నారు.