పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్లు అని స్పష్టం చేసింది. 1980 గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్ ప్రకారం పోలవరం రిజర్వాయర్ సామర్థ్యం 45.72 మీటర్లు అని  రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ ఇలా సమాధానం చెప్పారు. తొలి దశలో  పోలవరం ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని గత వారం సైతం పోలవరంపై కేంద్రం స్పష్టం చేసింది. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని తేల్చి చెప్పింది. వైసీపీ ఎంపీ  సత్యవతి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్  ఈ మేరకు సమాధానం ఇచ్చారు. తాజాగా ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు ఉంటుందని కేంద్ర మంత్రి రాజ్యసభలో చెప్పారు.


పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై సైతం కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 2017 - 18 ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 47,725 కోట్లు అని స్పష్టం చేశారు. 2019లో జలశక్తి శాఖకు ఇచ్చిన సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 55,548.87 కోట్లు కాగా, ఈ అంచనాలను జలశక్తి శాఖ అడ్వైజరీ కమిటీ అంగీకరించింది. 2020లో రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. అయితే 2013 - 14 ధరల ప్రకారం అంచనా వ్యయం రూ. 29,027.95 కోట్లు అని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రాజెక్టు కోసం భూ సేకరణ, పరిహారం, పునరావాసం ధరలలో పెరుగుదలే ప్రాజెక్టు వ్యయం పెరగడానికి కారణం అని కేంద్రం పేర్కొంది. అయితే పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.13,463 కోట్లు విడుదల చేసినట్లు ఎంపీ కనకమేడల ప్రశ్నలకు రాజ్యసభలో కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ సమాధానం ఇచ్చారు.


వైసీపీ ఎంపీ సత్యవతి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్  ఈ సమాధానం ఇచ్చారు. తొలిదశ సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023కే పూర్తి కావాల్సి ఉందని, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023 నాటికే ఇవ్వాల్సి ఉందని.. దానిని కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు. కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఏపీ ప్రభుత్వం కల్పించినట్లు చెప్పారు. మిగతావారికి సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇంతవరకు చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.


నిజానికి పోలవరంలో మొదటి దశ.. రెండో దశ అనేది లేదు. అయితే ఆర్థిక సమస్యల కారణం  ఎత్తు తగ్గించే ఆలోచనలో  ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ కూడా పలుమార్లు తొలి దశ ప్రస్తావన చేశారు. తొలి దశలో  41.15 మీటర్ల వరకే నిటి నింపడం .. ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఎంత ఎత్తు తగ్గిస్తే ఎంత ముంపును నివారించడానికి అవకాశం ఉందన్న అంశంపై కేంద్ర జల సంఘం ,పోలవరం ప్రాజెక్టు అథారిటీ తదితర సంస్థలను సంప్రదిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. నీటి మట్టాన్ని తగ్గించటం వల్ల ముంపుతో పాటు నిర్మాణ వ్యయాన్ని నియంత్రించవచ్చు అని భావిస్తున్నారు. 


పోలవరం ప్రాజెక్టుకు మొత్తం 1,13,119 ఎకరాల భూమిని సేకరించారు.   పోలవరం నిర్మాణంలో భూసేకరణ వ్యయం ఎక్కువగా వున్నందున రెండు దశల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రెండు దశల్లో కలిపి మొత్తం 45.72 మీటర్ల ఎత్తు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.