Anna Canteens Reopen In AP: నిరుపేదలకు రెండు పూటల నాలుగు వేలు నోట్లోకి వెళ్లడం చాలా కష్టం. అంతేకాదు... పని నిమిత్తం, ఆస్పత్రిలో చికిత్స కోసం బయట ప్రాంతాలకు వెళ్తుంటారు చాలా మంది. అక్కడ సరైన భోజనం దొరకదు. బయట హోటళ్లలో తినాలంటే... డబ్బులు సరిపోవు. అలాంటి వారికి కడుపునింపేందుకే... అన్న క్యాంటీన్ల (Anna Canteen)ను తీసుకొచ్చింది టీడీపీ. అయితే... గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) పాలనలో... అన్న క్యాంటీన్ల ఊసెత్తలేదు. ఇప్పుడు మళ్లీ ఏపీలో టీడీపీ ప్రభుత్వం (TDP Government) అధికారంలోకి వచ్చింది. వచ్చీరాగానే... అన్న క్యాంటీన్ల గురించి ఆలోచించింది. ఆగస్టు 15వ తేదీలోగా అన్న క్యాంటీన్లు తిరిగా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు (CM Chandrababu)  హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.... పంద్రాగస్టులోగా అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.


తొలిదశలో 183 అన్న క్యాంటీన్లు
తొలిదశలో 183 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని తెలుగు దేశం (టీడీపీ) ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే టెండర్లు పిలిచారు అధికారులు. ఈనెల 22 వరకు టెండర్లకు గడువు ఉంది. దీంతో... నెలాఖరులోగా అన్న క్యాంటీన్లకు ఆహారం  సరఫరా చేసే సంస్థలకు సంబంధించిన టెండర్లను ఖరారు చేయనుంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు... గత టీడీపీ ప్రభుత్వంలో నిర్వహించిన అన్న క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు. అందుకోసం 20 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఐవోటీ  డివైజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ కోసం 7 కోట్ల రూపాయలు కేటాయించింది టీడీపీ ప్రభుత్వం. మరో 20 అన్న క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మణం, పాత పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం 65 కోట్లు విడుదల చేయనుంది. 


దాతల నుంచి విరాళాల సేకరణ
అన్న క్యాంటీన్ల నిర్వహరణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తోంది. ఇందు కోసం అన్న క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్‌ ప్రారంభించి.. ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ తయారుచేయబోతున్నారు. దాతలు  ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అన్న క్యాంటీన్ల పూర్తి భావం ప్రభుత్వంపై పడకుండా... సరికొత్త ఆలోచన చేస్తున్నారు. దాతల సాయంతో అన్నా క్యాంటీన్లు నిర్వహించాలని డిసైడ్‌ అయ్యారు.  విరాళాల సేకరణ కూడా మొదలుపెట్టారు. అంతేకాదు... మరో కొత్త ఆలోచన చేశారు సీఎం చంద్రబాబు. పుట్టినరోజు జరుపుకునే వారు ఎవరైనా సరే... అన్న క్యాంటిన్‌ ద్వారా పేదలకు భోజనం అందిచొచ్చని చెప్పారు.


అన్న క్యాంటీన్లలో రేట్లు ఇలా...
పేద ప్రజలకు రెండు పూటలా కడుపు నిండా భోజనం అందించాలన్నదే అన్న క్యాంటీన్ల లక్ష్యం. ఈ క్యాంటీన్లలో టిఫిన్‌, భోజనం ధరలు చాలా తక్కువ. గత టీడీపీ హయాంలో కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం అందిచేవారు. అయితే... ఇప్పుడు ఆ  రేట్లు మారుస్తారా..? ధరలు పెంచుతారా...? అన్న చర్చ ప్రజల్లో ఉంది. టీడీపీ ప్రభుత్వ మాత్రం గతంలో మాదిరిగానే తక్కువ ధరలకే పేదలకు భోజనం అందించాలని భావిస్తోంది. కేవలం 5 రూపాయలకే టిఫిన్‌, ఐదు రూపాయలకే భోజనం అందిస్తామని చెప్తోంది. అంటే... 10 రూపాయలు పెడితే... రెండు పూటలా కడుపు  నింపుకోవచ్చు. ఇది నిజంగా... రాష్ట్రంలోని పేద ప్రజలకు శుభవార్త అనే చెప్పాలి.