Anil Kumar Yadav Comments: సిద్ధం సభకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వచ్చే నెల మూడో తేదీన జరిగే సిద్ధం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అనిల్ కుమార్ యాదవ్ సోమవారం (ఫిబ్రవరి 26) మీడియాతో మాట్లాడారు. దాదాపు 15 లక్షల మందికి పైగా సిద్ధం సభకు ప్రజలు వస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. తాము తాము సీట్లు సర్దుబాటు చేసుకుంటే చంద్రబాబు నాయుడు అవాకులు చావాకులు పేలాడని అన్నారు.
మొన్న టీడీపీ జనసేన లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలుసని అన్నారు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టాడని అన్నారు. హోల్ సేల్ గా కాపులను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తాకట్టుపెట్టారని వ్యాఖ్యానించారు. మార్చి 3న చివరి సిద్ధం సభ మేదరమెట్ల ప్రాంతంలో జరుగుతుందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గత సిద్ధం సభల కంటే కూడా మరింత ఎక్కువ మంది ప్రజలతో సిద్ధం సభ నిర్వహిస్తామని అన్నారు. ఆ సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అన్నారు.
నెల్లూరు నుంచి నరసరావుపేటకు
నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ గా పి. అనిల్ కుమార్ యాదవ్ ను వైసీపీ అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే. స్థానచలనంలో భాగంగా నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను పల్నాడు జిల్లాకు తీసుకొచ్చి ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. అందుకోసం ఫిబ్రవరి 18న మొట్టమొదటిగా నరసరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించారు.. అనిల్ కుమార్ యాదవ్. ఆయన్ను నరసరావు పేట ఎంపీ అభ్యర్థిగా అధికార వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిలను నియమించే ప్రక్షాళనలో భాగంగా ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ను పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా కొద్ది వారాల క్రితం ఖరారు చేశారు.
దీంతో తొలిసారిగా అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట నియోజకవర్గానికి చేరుకున్నారు. స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి గడపగడపలో ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి వల్ల తప్పకుండా ఈ పార్లమెంట్ స్థానంలో ఏడుకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుస్తామని అనిల్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.