TDP Survey: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసి అధికార పార్టీ కన్నా ముందే ఎన్నికల రేసు ఆరంభించిన తెలుగుదేశం(TDP)-జనసేన(Janasena) కూటమి... మలివిడత జాబితాపైనా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దాదాపు వందసీట్లు ప్రకటించిన కూటమి....మిగిలిన సభ్యుల లెక్క సైతం త్వరగా తేల్చి ప్రచారంలోకి దూసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల ప్రకటన ఆషామాషీగా జరగలేదని దాదాపు కోటీ 30 లక్షల మంది అభిప్రాయాలు తీసుకున్నామని ఇప్పటికే తెలిపిన చంద్రబాబు(CBN)...మిగిలిన సభ్యుల ఎంపిక కోసం ఐవీఆర్ఎస్(I.V.R.S) సర్వే నిర్వహిస్తున్నారు. కొత్త సర్వేతో అటు సీనియర్ల గుండెల్లో రైళ్లు పరుగుడెతుండగా... ఎక్కడ తమ సీటుకు ఎసరొస్తుందోనని  ఇంకా సీట్లు ప్రకటించని నేతలు భయపడుతున్నారు..


తెలుగుదేశం ఐవీఆర్ఎస్ సర్వే
తెలుగుదేశం(TDP) చరిత్రలో ఎప్పుడూ లేనంత ముందుగా అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి సిద్ధమంటూ సవాల్ విసిరిన చంద్రబాబు(CBN)...మిగిలిన అభ్యర్థుల లెక్కలు సైతం తేల్చే పనిలో పడ్డారు. గత సంప్రదాయలకు  భిన్నంగా దూకుడు వ్యవహరిస్తున్న చంద్రబాబు...వీలైనంత త్వరగా టిక్కెట్ల లొల్లి తేల్చుకుని పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టిసారించేలా ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. అవసరమైనంత మేర టిక్కెట్ల రాని నేతలను బుజ్జగించడం అప్పటికీ మాట వినకుంటే మీ ఇష్టమంటూ తేల్చిపడేస్తున్నారు. గతంలో మాదిరిగా చివరి నిమిషం వరకు తలనొప్పులు పెట్టుకోవడం లేదు. తొలిజాబితాలో టిక్కెట్లు దక్కని నేతలను పిలిచి మాట్లాడిన చంద్రబాబు(CBN).... మరుసటి రోజే వారి పేరిట వివిధ నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్(IVRS) సర్వే నిర్వహించడం విశేషం. సర్వేలో అనుకూల ఫలితాలు వస్తే ఓకే..లేకుంటే టిక్కెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. కొంంతమంది నేతలకు స్థానచలనం తప్పదని స్పష్టతనిచ్చిన అధినేత ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో వారి పేరిట సర్వే నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) చేరడంతో ఆయనకు సిట్టింగ్ మైలవరం టిక్కెటే కేటాయిస్తున్నారు. ఈ మేరకు వసంత కృష్ణప్రసాద్ తో ముందుగానే ఒప్పందం జరిగింది. దీంతో అక్కడ ఉన్న తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమ(Devineni Uma) పెనమలూరుకు మారాల్సి వచ్చింది. పార్టీ సీనియర్ నేతగా...జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన దేవినేనికి అన్ని నియోజకవర్గాల్లోనూ  పరిచయాలు ఉన్నాయి. అందుకే ఆయన్ను అధినేత పెనమలూరు నుంచి పోటీ చేయాల్సిందిగా సూచించారు. దీంతో ఇవాల్టి నుంచి దేవినేని ఉమ పేరిట పెనమలూరు నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతోంది. 


ర్యాండమ్ గా నియోజవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి దేవినేని ఉమ మీ అభ్యర్థిగా అయితే ఓకేనా అంటూ పలువురిని ఫోన్ వాయిస్ రికార్డుల ద్వారా సంప్రదిస్తున్నారు. అంటే దేవినేని ఉమా పెనమలూరుకు వెళ్లడం దాదాపు ఖాయమైనట్లే.  ఇప్పటికే పెనమలూరు టిక్కెట్ వైసీపీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) కు కేటాయించింది. గతంలోనూ వీరిరువురూ  మైలవరంలో పోటీపడిన అనుభవం ఉంది. పైగా ఇప్పుడు ఇద్దరూ ఈ నియోజకవర్గానికి కొత్తవారు, స్థానికేతరులే  కావడంతో  ఇబ్బంది ఉండకపోవచ్చని తెలుగుదేశం అధిష్టానం భావిస్తోంది. నిన్న
వరకు ఎం.ఎస్.బేగ్ పేరిట పెనమలూరులో ప్రజాభిప్రాయం సేకరించారు. 


పేటలోయరపతినేని, గురజాలలో జంగా
తొలి జాబితాలో చోటు దక్కని మరో కీలక నేత యరపతినేని(Yarapathineni) శ్రీనివాసరావుకు సైతం స్థానచలనం తప్పేట్లు లేదు.ఆయన్ను నరసరావుపేట (Narasaraopet)నుంచి బరిలో దింపేందుకు తెలుగుదేశం అధిష్టానం ఐవీఆర్ ఎస్(IVRS) సర్వే చేయిస్తోంది. తెలుగుదేశానికి మంచి పట్టున్న స్థానం కావడంతో...గతంలో కోడెల శివప్రసాదరావు పలుమార్లు ఇక్కడి నుంచి నెగ్గారు. అదే దూకుడు కనబరిచే యరపతినేని అయితే ఖచ్చితంగా  నెగ్గుకురాగలమని భావించిన చంద్రబాబు(CBN)...ఆయన్ను ఇక్కడి నుంచి పోటీ చేయాల్సిందిగా కోరే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే సర్వే చేయిస్తున్నారు. అలాగే గురజాల(Gurajala) నుంచి వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి(Janga Krishna Murthy) పేరు పరిశీలిస్తున్నారు. ఇటీవల వైసీపీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేస్తున్న జంగా కృష్ణమూర్తి తెలుగుదేశంలో చేరే అవకాశం ఉంది. ఆయన గతంలో గురజాల నుంచి రెండుసార్లు గెలుపొందారు. ఆయన సామాజికవర్గం యాదవుల ఓట్లు ఈ నియోజకవర్గంలో మెండుగా ఉన్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు....నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోకి వచ్చే గురజాలలోని యాదవుల ఓట్లు వైసీపీ లోక్ సభ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు మళ్లకుండా నియంత్రించేందుకే  తెలుగుదేశం పార్టీ జంగా కృష్ణమూర్తికి గాలం వేసినట్లు  తెలుస్తోంది. ఇటు అసెంబ్లీ పరిధిలోనూ, అటు పార్లమెంట్ స్థానం పరిధిలోనూ బీసీ ఓట్లు చేజారిపోకుండా  జంగా కృష్ణమూర్తిని పార్టీలోకి తీసుకుని గురజాల సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో  పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి పేరుతో తాజాగా ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. అలాగే వైసీపీని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీతో జట్టుకట్టిన ఆనం రాంనారాయణరెడ్డి పేరిట వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరులో సర్వే నిర్వహించారు. ఈ మూడుచోట్ల ఆయనకు ఎక్కడ ఎక్కువ ఆదరణ ఉంటే ఆ సీటు కేటాయించే అవకాశం ఉంది.


చింతమనేని కుమార్తెకు సీటు
తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్(Chinthamaneni Prabhakar) కు కాకుండా ఈసారి ఆయన కుమార్తెకు సీటు ఇవ్వనున్నట్లు సమాచారం. యువత, మహిళ కోటాలో ఆమెను తెలుగుదేశం పార్టీ రంగంలోకి దింపుతోంది. ఆమె పేరిట నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే తొలి జాబితాలో పేరులేని కళా వెంకట్రావు, పీలా గోవింద్, బండారు సత్యనారాయణమూర్తి, జవహర్ లకు సీట్లపై ఇంకా స్పష్టత రాలేదు.