Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదని, వాటిని అసెంబ్లీలో అడిగే దమ్ము జగన్ మోహన్ రెడ్డికి లేదని ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోషల్ మీడియా వేదికగా ఇద్దరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై ప్రేమ ఉంటే నిరూపించుకోవాలని సవాల్ చేశారు.
9 నెలల్లో 90 కారణాలు
భారీ ఎన్నికల హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంగతి మర్చిపోయారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ పథకాలు ప్లాప్ అయ్యాయని అన్నారు. వాటి అమలు గురించి అడిగితే ఈ 9 నెలల్లో 90 కారణాలు చెప్పారని విమర్శించారు. ఇప్పటికైనా హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. వాటిని అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ చేశారు.
Also Read: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్, విజయవాడ రూట్‌లో వెళ్లేవారికి రాయితీ ప్రకటన
బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించండి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చినహామీలు నెరవేర్చేందుకు బడ్జెట్ కావాల్సిన నిధులు కేటాయించాలని షర్మిల డిమాండ్ చేశారు. 28న ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని పథకాలు ఏడాది లోపు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
కూటమిప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ములేదు
ప్రజలకు ఇచ్చిన పథకాలు అమలు గురించి అడిగే దమ్ము వైసీపీకి లేదన్నారు షర్మిల. నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్ళను జైలుకెళ్లి పరామర్శించే సమయం జగన్ మోహన్ రెడ్డికి ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లేందుకు మాత్రం ఆయనకు మొహం చెల్లదని సెటైర్లు వేశారు.
అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామా చేయండి
ప్రెస్ మీట్‌లు పెట్టీ పురాణం అంతా చెప్పే తీరిక జగన్‌కి దొరుకుతుంది కానీ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం లేదని అన్నారు షర్మిల. ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా మారం చేసే వైసీపీ అధ్యక్షుడికి, పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజల మధ్య తిరిగే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యల మీద మాట్లాడే నైతికత అసలే లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సారైనా అసెంబ్లీకి వెళ్ళాలని డిమాండ్ చేశారు. సభా వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. ఈసారి కూడా అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా