ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల పట్ల స్పీకర్ తమ్మినేని సీతారామ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సభ్యులు పదే పదే నిరసనలు తెలియజేస్తుండడంతో ఇకపై ఎవరూ పోడియం వద్దకు వచ్చి గందరగోళం చేయవద్దని ఆయన నిర్ణయం తీసుకున్నారు. లైన్ దాటకుండా నిరసన తెలిపే హక్కు సభ్యులకు ఉందని చెప్పారు. ఒకవేళ పోడియం వద్దకు వస్తే సస్పెండ్ చేస్తానని స్పీకర్ కీలక రూలింగ్ జారీ చేశారు.
తన కుర్చీ వద్దకు వచ్చే హక్కు టీడీపీ సభ్యులకు లేదని స్పీకర్ స్పష్టం చేశారు. సభలో ప్రతి పార్టీకి చెందిన సభ్యులు తనకు సమానమేనని అన్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదని తెలిపారు. స్పీకర్ చైర్‌ను టచ్ చేసి ముఖంపై ప్లకార్డులు ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత జరిగినా టీడీపీ సభ్యుల ప్రవర్తనను తాను మౌనంగానే భరించానని తెలిపారు. తాను గౌతమ బుద్దుడిని కాదని అన్నారు.
‘‘టీడీపీ నేతలు పేపర్లు చింపి నాపైన వేస్తుంటే పూలు చల్లుతున్నట్టుగానే భావించా. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎలీజాను టీడీపీ సభ్యులు నెట్టేశారు. సభా సమయం, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రోజాను ఏడాది సస్పెండ్ చేశారు. సభలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తారు. టీడీపీ నేతల తీరు మారాలి. శ్రీరామ చంద్రుడు లాంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో ఉన్నారని, రావణాసురులను ఎలా సంహరించాలో ఆయనకు తెలుసునని తమ్మినేని సీతారాం అన్నారు.
అసెంబ్లీలో దాడి చేసుకున్న ఎమ్మెల్యేలు దాడి
ఏపీ అసెంబ్లీలో నేడు విపరీతమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన తెలిపారు. జీవో నెంబరు 1ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు.. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపైనా వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని ఆరోపించారు. అయితే, ఈ ఉద్రిక్తత ప్రారంభం అవుతుండగానే, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో సభను స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాత్రం.. తనపై చంద్రబాబు దాడి చేయించారని, అందుకే డోలా బాలవీరాంజనేయులు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఆ క్రమంలో తన చేతికి గాయం కూడా అయిందని అసెంబ్లీ బయట మీడియాకు చూపించారు. దానికి సంబంధించిన విజువల్‌ను స్పీకర్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
అసెంబ్లీలో ఆందోళనల నేపథ్యంలో వాయిదా పడి మళ్లీ అసెంబ్లీ ప్రారంభంకాగానే టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, డోలా బాలవీరాంజనేయులు, సహా మొత్తం 11 మంది సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. వారంతా గౌరవప్రదంగా బయటకు వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు.
జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు - చంద్రబాబు
శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిపై దాడిని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజు అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై దాడి జరిగిన ఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. సీఎం జగన్ ప్రోద్భలంతో, ఒక వ్యూహంతోనే నేడు దళిత ఎమ్మెల్యే స్వామిపై దాడి చేశారని అన్నారు.