ఏపీ అసెంబ్లీలో జరిగిన ఉద్రిక్తతలో టీడీపీ సభ్యుల దాడిలో తాను గాయపడినట్లుగా వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు ఆరోపించారు. శాసన సభలో గొడవకు చంద్రబాబే కారణం అని అన్నారు. ఆయన ఆదేశాల ప్రకారమే టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామితో తనపై దాడి చేయించారని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిపైన కూడా డోలా దూషణలకు దిగారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇవాళ ఒక బ్లాక్‌ డే అని అన్నారు. 


‘‘బలహీన వర్గాలకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం మీద చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారం దాడి చేయించారు. ప్రతిరోజు పేపర్లు చింపటం, ప్లకార్డులు మొహం మీద పెట్టడం, విసిరివేయడం.. స్పీకర్‌‌ని పదే పదే అవమానించటం వంటివి చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి సభాపతిపై దాడి చేయబోతే ఎమ్మెల్యే ఎలీజా సభాపతిని తాకనివ్వకుండా చేయి అడ్డు పెట్టారు. టీడీపీ సభ్యులు అంతా నెడుతుంటే ఎమ్మెల్యే ఎలీజాని కాపాడటం కోసం పోడియం పైకి వెళ్తే.. నన్ను అగ్రవర్ణానికి చెందిన బెందాళం అశోక్‌ దారుణాతిదారుణంగా తిట్టి తోసేశారు. దాంతో నా చేతికి గాయమైంది. తక్షణమే ఆ విజువల్స్‌ను స్పీకర్‌ పరిశీలించి, ఎవరైతే మా మీద దాడికి పాల్పడ్డారో ఆ టీడీపీ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి, చర్యలు తీసుకోవాలి’’ అని ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్ చేశారు.


బీసీలు, ఎస్సీల మధ్య ఘర్షణలకు బాబు కుట్ర - డిప్యూటీ సీఎం నారాయణ స్వామి


‘‘నన్ను కూడా రేయ్ నా.కొ. అని అసభ్యంగా మాట్లాడారు. బీసీలను బీసీలతో, ఎస్సీలను ఎస్సీలతో, రెడ్లను రెడ్లతో చంద్రబాబు తిట్టిస్తారు. ఒక ఎస్సీ ఎమ్మెల్యేతో బీసీ వర్గానికి చెందిన స్పీకర్‌ మీద దాడి చేసి లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారు. గతంలోనూ జగన్ నేతృత్వంలో గెలిచిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని, వారిలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చి, అసెంబ్లీలో నానా తిటలు తిట్టించిన చరిత్ర చంద్రబాబుది. బీసీ, ఎస్సీలకు గొడవ పెట్టాలని చూశారు. ఒక ఎస్సీని రెచ్చగొట్టి (బాలవీరాంజనేయ స్వామి) స్పీకర్‌ మీద దౌర్జన్యం చేస్తే.. రకరకాలుగా లబ్ధిపొందాలని ఇలాంటి పనులు చంద్రబాబు చేస్తున్నారు’’ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడారు.


ప్రజాస్వామ్యంలో ఇవాళ బ్లాక్‌ డే: ఎమ్మెల్యే ఎలీజా
చంద్రబాబు డైరెక్షన్‌ ప్రకారం ఏదో విధంగా సభలో అల్లరి చేయాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో ఇవాళ టీడీపీ సభ్యుల తీరు మితిమీరిపోయింది. స్పీకర్‌ మీదకి దాడి చేయటానికి ప్రయత్నించి, టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి, ఆయన్ను చేతితో పొడవటం, దౌర్జన్యం చేసి స్పీకర్ ను అవమానించడం జరిగింది. దాన్ని చూసి నేను స్పీకర్ పోడియం వద్దకు వెళితే.. టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి, నా చేతిని పట్టుకుని నన్ను కూడా తోసేశారు. అప్పుడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కిందకు లాగారు. సుధాకర్‌ బాబు మీదకి కూడా టీడీపీ సభ్యుడు దాడి చేయటం జరిగింది. స్పీకర్‌ గారిని కాపాడటం కోసం మేం వెళ్లాం. శాసనసభకు సభాపతిగా ఉన్న బీసీ నాయకుడిని ఈ రకంగా  అవమానించటం, మర్యాద ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉంది. సభలో ఈ దుర్మార్గపు చర్యలకు పాల్పడటాన్ని ఖండిస్తున్నాం. మా పార్టీ ఎమ్మెల్యే సుధాకర్‌ మీద దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా.’’ అని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే వున్నమట్ల రాకాడ ఎలీజా మాట్లాడారు.


ఎస్సీ ఎమ్మెల్యేతో స్పీకర్ పై దాడి - కంబాల జోగులు, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే 
‘‘ఇవాళ జరిగిన సంఘటన చాలా బాధాకరం. 2004 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాం. ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తుందో చూసేవాళ్లం. ఇవాళ జరిగింది చాలా బాధాకరం. టీడీపీ నాయకులు స్పీకర్‌ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. పేపర్లు విసరటం, పోడియం చుట్టుముట్టడం చేశారు. ఇవాళ డోలా వీరాంజనేయ స్వామి ప్రవర్తన బాధాకరం. టీడీపీ వారు ఒక ఎస్సీ ఎమ్మెల్యేను ముందు పెట్టి.. స్పీకర్ పై దాడికి తెగబడటం సరికాదు. స్పీకర్ మీద చేయి చేసుకోవటం విజువల్స్‌లో కనిపిస్తోంది. స్పీకర్‌ను తాకుతుంటే ఆయనకు ఏమైనా అవుతుందని ఎలీజా వెళ్లారు. ఆ తర్వాత ఎలీజాకు ఏం జరుగుతుందో అని మేమంతా వెనక వెళ్లాం. ఇలాంటి సంఘటన జరగటం చాలా బాధాకరం. విజువల్స్ చూసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇలాంటి సంఘటనలతో రాష్ట్రానికి, అసెంబ్లీకి చెడ్డపేరు వస్తుంది. ఇలాంటి ఘటనలు అసెంబ్లీలో జరగకూడదు.