ఏపీ అసెంబ్లీలో నేడు విపరీతమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన తెలిపారు. జీవో నెంబరు 1ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు.. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపైనా వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని ఆరోపించారు. అయితే, ఈ ఉద్రిక్తత ప్రారంభం అవుతుండగానే, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో సభను స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాత్రం.. తనపై చంద్రబాబు దాడి చేయించారని, అందుకే డోలా బాలవీరాంజనేయులు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఆ క్రమంలో తన చేతికి గాయం కూడా అయిందని అసెంబ్లీ బయట మీడియాకు చూపించారు. దానికి సంబంధించిన విజువల్‌ను స్పీకర్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


మేం దాడి చేసుంటే ఉరి తీయండి - అచ్చెన్నాయుడు



దీనిపై మీడియా పాయింట్ వద్ద టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు  వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరించడం దారుణమని  ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరిందని వ్యాఖ్యానించారు. టీడీపీ మూడు ఎమ్మెల్సీలు గెలవడంతో వైసీపీకి మతి పోయిందని అన్నారు. 75 ఏళ్ల వ్యక్తి అయిన బుచ్చయ్య చౌదరిపై, డోలా బాలవీరాంజనేయ స్వామిపై దాడి చేయడం దారుణం అని అన్నారు. సీటులో ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై మంత్రి వెల్లంపల్లి దాడి చేశారని ఆరోపించారు. ఘర్షణకు సంబంధించిన మినిట్ టూ మినిట్ వీడియోను స్పీకర్ బయటకు తీయాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌పై తాము దాడి చేసి ఉంటే మమ్మల్ని అసెంబ్లీలోనే ఉరి తీయండని మాట్లాడారు. 


అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్


అసెంబ్లీలో ఆందోళనల నేపథ్యంలో వాయిదా పడి మళ్లీ అసెంబ్లీ ప్రారంభంకాగానే టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, డోలా బాలవీరాంజనేయులు, సహా మొత్తం 11 మంది సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. వారంతా గౌరవప్రదంగా బయటకు వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు.


జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు - చంద్రబాబు


శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిపై దాడిని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజు అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై దాడి జరిగిన ఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. సీఎం జగన్ ప్రోద్భలంతో, ఒక వ్యూహంతోనే నేడు దళిత ఎమ్మెల్యే స్వామిపై దాడి చేశారని అన్నారు. నేటి సభలో జరిగిన ఘటనతో జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడని అన్నారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన సీఎంగా జగన్ నిలిచిపోతాడని, స్వయంగా సభలో ఎమ్మెల్యేలపై దాడికి దిగడం ద్వారా వైసీపీ సిద్దాంతం ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్ కు పిచ్చెక్కి ఇలా వ్యవహరించాడని, ఇది శాసన సభ కాదు.. కౌరవ సభ అని అన్నారు.