Mana Mitra WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే వాట్సప్‌ ద్వారా 150 వరకు సేవలు పొందే వెసులుబాటు వాట్సప్‌ మనమిత్ర ద్వారా కల్పించింది. ఇప్పుడు దానికి మరింత మెరుగులు దిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉన్న సర్వే మొన్నటి వరకు తెలుగులో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ సేవలు ఇంగ్లిష్‌లో కూడా లభిస్తున్నాయి. ఇదంతా అక్షరాస్యులకే పరిమితం అవుతుందని గ్రహించిన ప్రభుత్వ మరింత అడ్వాన్స్డ్‌ టెక్నాలజీని వాడుకోనుంది. దీని తోడు పౌరులందరికీ ఓ డిజి లాకర్‌ ఏర్పాటు చేయబోతోంది. 

నేటి కాలంలో చాలా పనులు చేతిలో మొబైల్ ఉంటే అయిపోతున్నాయి. అలాంటి ప్రభుత్వ పనులకు ఎందుకు సమయాన్ని  వృథా చేసుకొని కార్యాలయాల చుట్టూ తిరగడం అని ఆలోచించిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా పాలనను హైటెక్ చేస్తోంది. ఇప్పటికే మన మిత్ర పేరుతో ఓ వాట్సాప్ క్రియేట్ చేసింది. 9552300009కు నెంబర్‌తో 150 వరకు సేవలు పొంద వచ్చు. ఇందులో ఇంటర్మీడియెట్ హాల్‌టికెట్లను కూడా పొందేలా ఏర్పాట్లు చేసింది. 

ఇంత వరకు అందుతున్న సేవలు అక్షరాస్యులు మాత్రమే వాడుకోగలుగుతున్నారు. కానీ నిరక్షరాస్యులకు అవకాశంలేదని గ్రహించిన ప్రభుత్వం మన మిత్రను అప్‌డేట్ చేయడానికి సిద్ధమైంది. టైప్‌ చేయలేని వాళ్లు ఇతరులు ఆ సేవలు వినియోగించుకునేలా వాయిస్ మెసేజ్ ద్వారా కమాండ్ ఇస్తే పని చేసేలా తీర్చిదిద్దబోతున్నారు. 

వీటికితోడు రెండో విడతలో కూడా మరిన్ని సేవలు యాడ్ చేసేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. అన్ని పత్రాలను డిజిటలైజ్ చేస్తున్నారు. అందుకు ప్రతి శాఖకు టార్గెట్‌ ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. వాట్సాప్ ద్వారా ఎన్ని సేవలు అందించగలిగితే ప్రజలకు అంత మేలు జరుగుతుందని భావిస్తున్నారు. లంచాలకు ఆస్కారం లేకుండా సమయం వృథా కాకుండా క్షణాల్లో పనులు అయిపోతాయని అంటున్నారు. 

ఇలా డౌన్‌లోడ్ చేసిన పత్రాల కోసం ప్రతి పౌరుడికి ఓ డిజి లాకర్ ఇస్తే ఎలా ఉంటుందే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఒకసారి డౌన్ లోడ్ చేసిన సర్టిఫికేట్ ఆ డిజిలాకర్‌లో సేవ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా యూజ్ చేసుకునే వెసులుబాటు వస్తుంది. పదే పదే ప్రభుత్వ శాఖలపై ఆధార పడకుండా ఉంటుంది. 

Also Read: వాట్సాప్ ద్వారా తిరుమల టిక్కెట్‌లు కూడా బుక్ చేసుకోవచ్చా ? - మన మిత్ర పని తీరు ఎలా ఉంది ?

ప్రతి పౌరుడికి ఒక డిజి లాకర్‌ సౌకర్యాన్ని  కల్పించినట్టైతే మొబైల్ ఉంటే చాలు ఏ సర్టిఫికేట్ అయిన ప్రజల చేతిలో ఉంటుందని ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌ అన్నారు. వాట్సప్‌ గవర్నెన్స్‌పై సమీక్ష నిర్వహించిన ఆయన సేవలు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి సేవలు పౌరులకు మెరుగ్గా అందాలంటే ముందుగా డేటా అనుసంధానం జరగాలని అన్నారు. ఆ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు. 

ఒకసారి ప్రభుత్వంలో ఉన్న డేటా మొత్తం అనుసంధానం అయితే వాట్సాప్ ద్వారానే ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయవచ్చని కూడా చెబుతున్నారు. వాటి పరిష్కారం కూడా అధికారులకు సులభం అవుతుందని చెప్పుకొచ్చారు భాస్కర్. ఇలాంటి పనులు మరింత వేగవంతంగా జరిపేందుకు ప్రతి శాఖలో చీఫ్‌ డేటా టెక్నికల్ అధికారిని నియమిస్తామని వెల్లడించారు.  

డిజిలాకర్‌ ప్రజలకు అందుబాటులోకి వస్తే ప్రతి పనికి ధ్రువపత్రాలు తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఉంటుందని చేతిలో మొబైల్ ఉంటే సరిపోతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ డిజిలాకర్ సౌకర్యం కల్పిస్తోంది. అందులో మనకు రెగ్యులర్‌గా ఉపయోగపడే సర్టిఫికేట్స్‌ పెట్టుకోవచ్చు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

Also Read: వాట్సప్‌లో ఇంటర్‌ హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి