New Ration Card In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తకార్డులు, ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులపై కదలిక మొదలైంది. నూతన రైస్ కార్డుల జారీ, మార్పులు చేర్పులకు సంబందించి మొత్తం ఆరు రకాల సేవలు బుధవారం నుంచి ప్రారంభం అవుతాయి. ఈ మేరకు రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన జారీ చేశారు. 

Continues below advertisement


ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
కొత్త రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్న వారిని తొలగించడం,  కార్డులను సరెండర్ చేయడం ఇలా ఆరు రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వారం రోజుల తుదుపరి వాట్సాప్ గవర్నెన్సు ద్వారా కూడా ఈ సేవలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. జూన్ మాసంలో స్మార్టు  కార్డుల రూపంలో నూతన రైస్ కార్డుల జారీకి సన్నాహలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 




మంగళవారం రాష్ట్ర సచివాలయం నాల్గోబ్లాక్ ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల వల్ల నూతన కార్డుల జారీని నిలిపేశారని చెప్పారు. ఆ తర్వాత ఈకేవైసీ తప్పని సరిగా నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా కొత్త కార్డుల జారీ ఆలస్యమైందన్నారు. ఇప్పటి వరకు 94.4 శాతం మేర ఈకేవైసీ ప్రక్రియ పూర్తైంది. అందుకే నూతన రైస్ కార్డుల జారీకి అవకాశం కల్పించామన్నారు. 


రాష్ట్రంలో మొత్తం 1,46,21,223 రైస్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా దాదాపు 4,24,59,028 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు,  80 సంవత్సరాలు పైబడిన వారికి ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదనే వెసులుబాటు కల్పించామని వివరించారు. దీని వల్ల దాదాపు 6,45,765 మంది దూరంగా ఉన్నారని తెలిపారు. అదే విధంగా ఇప్పటికే 3,94,08,070 మంది తమ రైస్ కార్డులో మార్పులు చేర్పుల కోసం నమోదు చేసుకున్నారు. 


ఈ ఏడాది జూన్ మాసంలో క్యూఆర్ కోడ్‌తో స్మార్టు రైస్ కార్డులు జారీ చేస్తారు. ఆ కార్డులపై కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఉంటాయి. ఆ కార్డును స్కాన్ చేయగానే అన్ని వివరాలు కనిపిస్తాయి. డేటా బేస్‌కి ఈ కార్డును లింక్ చేయడం వల్ల సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతుంది.