Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో 13 సంస్థలకు ప్రభుత్వం నియమించిన ఉపసంఘం షాక్ ఇచ్చింది. అమరావతిలో ఆ సంస్థలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీటితోపాటు మరికొన్ని కీలక చర్యలకు సిఫార్సు చేసింది. 

అమ‌రావ‌తిలో వివిధ సంస్థలకు భూకేటాయింపుల‌కు సంబంధించి మంత్రివర్గ ఉప‌సంఘం సోమవారం సమావేశమైంది. రాజ‌ధానిలో గ‌తంలో భూములు పొందిన 13 సంస్థ‌ల‌కు చేసిన కేటాయింపులు ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. వివిధ కారణాల‌తో కేటాయింపులు ర‌ద్దున‌కు సబ్ క‌మిటీ ఆమోద ముద్ర వేసింది. స‌చివాల‌యంలోని రెండో బ్లాక్‌లోని మొద‌టి అంస్థులో జ‌రిగిన ఈ స‌మావేశానికి మంత్రులు నారాయ‌ణ‌, ప‌య్యావుల కేశవ్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర‌, టీజీ భ‌ర‌త్‌సహా మున్సిప‌ల్ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సురేష్ కుమార్, సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు, ఇత‌ర అధికారులు హాజ‌ర‌య్యారు. 

2014-19 మ‌ధ్య కాలంలో అమ‌రావ‌తిలో పలు సంస్థలకు భూములు కేటాయించారు. వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ స‌బ్ క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంది. ఈ స‌మావేశం ముగిసిన త‌ర్వాత మంత్రులు నారాయ‌ణ‌, పయ్యావుల కేశవ్ ఆ వివరాలను మీడియాకు వివరించారు. 

అమ‌రావ‌తిలో గతంలో 131 సంస్థ‌ల‌కు భూములు కేటాయించిన‌ట్లు మంత్రి నారాయ‌ణ తెలిపారు. వీటిలో 31 సంస్థ‌ల‌కు గ‌తంలో చేసిన కేటాయింపులు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. మ‌రో రెండు సంస్థ‌ల‌కు గ‌తంలో ఇచ్చిన చోట కాకుండా వేరొక చోట కేటాయింపులు చేస్తూ స‌బ్ క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. ఇక 16 సంస్థ‌ల‌కు గ‌తంలో కేటాయింపులు చేసిన విస్తీర్ణంలో మార్పులు చేయ‌డంతో పాటు వేరొక ప్రాంతాల్లో కేటాయింపులు చేస్తున్నామ‌న్నారు. ఇక 13 సంస్థ‌ల‌కు వివిధ కార‌ణాల‌తో భూకేటాయింపులు ర‌ద్దుకు స‌బ్ క‌మిటీ అంగీకారం తెలిపింద‌ని మంత్రి చెప్పారు. 

వైసీపీ ప్ర‌భుత్వం క‌క్ష సాధింపుతో మూడు ముక్క‌లాట ఆడి రాజ‌ధానిని ప‌క్క‌న ప‌డేసిందని నారాయణ ఆరోపించారు. అప్ప‌ట్లోనే 43 వేల కోట్ల‌కు విలువైన ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచి 9 వేల కోట్ల విలువైన ప‌నులు పూర్తి చేసామ‌న్నారు. అయితే వైసీపీ క‌క్ష సాధింపుతో అమ‌రావ‌తిపై మూడు ముక్క‌లాట ఆడిందని మండిపడ్డారు. కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత అనేక న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికి 8 నెల‌లు ప‌ట్టిందని గుర్తు చేశారు. 

48 వేల కోట్ల విలువైన ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచి ఇప్ప‌టికే ఏజెన్సీల‌ను ఎంపిక చేశామని నారాయణ వివరించారు. సీఆర్డీఏ అథారిటీ స‌మావేశంలో ఆమోదం పొంద‌గానే ఆయా సంస్థ‌ల‌తో సీఆర్డీఏ అగ్రిమెంట్లు చేసుకుంటుందని అన్నారు. ఆ వెంట‌నే రెండు మూడు రోజుల్లో అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు మంత్రి నారాయ‌ణ‌. ఎన్నిక‌ల కోడ్ ఉండ‌టంతో టెండ‌ర్ల ప్ర‌క్రియ ఆల‌స్యం అయిందని మ‌రోసారి తెలియజేశారు మంత్రి.

భూముల అమ్మకం ద్వారానే అమ‌రావ‌తి నిర్మాణంఛ ప‌య్యావుల కేశ‌వ్.రాజ‌ధాని కోసం ప్ర‌జ‌ల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌డం లేదని మంత్రి కేశ‌వ్ తెలిపారు. భూముల అమ్మకాల‌తో మాత్ర‌మే అమ‌రావ‌తి నిర్మాణం జ‌రుగుతుందని...ఖ‌జానాపై భారం లేకుండా సీఎం చంద్ర‌బాబు మంచి మోడ‌ల్ డిజైన్ చేసారని చెప్పారు. గ‌తంలో అమ‌రావ‌తి కోసం జ‌గ‌న్ ల‌క్ష కోట్లు కావాల‌ని ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని...ల‌క్ష కోట్లు అవ‌స‌రం లేకుండానే రాజ‌ధాని నిర్మిస్తున్నామ‌ని మంత్రి ప‌య్యావుల అన్నారు. వైసీపీ ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టి వారితో ఆడుకున్నారని ఎద్దేవా చేశారు.