Andhra Pradesh Latest News: మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు.  ఉండవల్లి నివాసంలో జెండా ఊపి సర్వీస్‌లు స్టార్ట్ చేశారు. ఎయిమ్స్ హాస్పిటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు ఈ సేవలు పొందవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న విషయం మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది.

లోకేష్‌ ఇచ్చిన పిలుపునకు స్పందించిన మెగా ఇంజినీరింగ్ సంస్థ 

ప్రజా సమస్యల గురించి తెలుసుకున్న లోకేష్‌  సిఎస్ఆర్ నిధుల నుంచి బస్సులు సమకూర్చాల్సిందిగా మెగా ఇంజనీరింగ్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (MEIL)ను అభ్యర్థించారు. లోకేష్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన MEIL ఫౌండేషన్ రూ.2.4కోట్ల విలువైన రెండు అత్యాధునిక 7 మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులు అందజేసింది. 

 

మంగళగిరి టూ ఎయిమ్స్‌ 

ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డిజిపి ఆఫీసు మీదుగా ఎయిమ్స్ వరకు నడపనున్నారు. ఈ బస్సు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సర్వీస్ చేస్తుంది.  

 

మంగళగిరి టు పానకాల స్వామి టెంపుల‌్‌

ఇంకొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడి వరకు నడుస్తుంది. పానకాలస్వామి ఆలయానికి వెళ్లే ఈ బస్సు ఉదయం 7నుంచి రాత్రి 8గంటల వరకు ప్రయాణీకులకు ఉచితంగా సేవలందిస్తుంది. 

ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు రయ్‌ రయ్‌

ప్రతి బస్సు 18 మంది ప్రయాణికుల సామర్థ్యంతో నడుస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు తిరుగుతుంది. ఈ బస్సులు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ (EHPS), రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ (VTS), రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ (RPAS) వంటి అత్యాధునిక సౌకర్యాలతో భద్రతాప్రమాణాలు కలిగి ఉన్నాయి. 

కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు 

బస్‌ల ఓపెనింగ్ కార్యక్రమంలో నారా లోకేష్‌తోపాటు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ K.V. ప్రదీప్, ఎయిమ్స్ డైరక్టర్ శాంతా సింగ్, డిప్యూటీ డైరక్టర్ శశికాంత్, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.కోటిరెడ్డి, టిటిడి బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని అనిత, తాడేపల్లి పాల్గొన్నారు.