Andhra Pradesh Free Bus Scheme : ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం కానుంది. శ్రీ శక్తి పేరుతో అమలులోకి తీసుకొచ్చే పథకాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందుక తగ్గట్టుగానే ఏర్పాటు చేస్తోంది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోగ్రామ్‌ను లాంచ్ చేస్తారు. అనంతరం విజయవాడలోని బస్టాండ్‌లో మహిళలతో కలిసి ప్రయాణం చేస్తారు. తొలి టికెట్ చంద్రబాబు చేతుల మీదుగా మహిళలకు అందజేస్తారు. దీంతో శ్రీ శక్తి పథకం అధికారికంగా ప్రారంభమవుతుంది.
ముఖ్యమంత్రి విజయవాడలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటే మంత్రులు తమ జిల్లాల్లో పాల్గొంటారు. మిగతా ప్రాంతాల్లో ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరవుతారు. మహిళలతో కలిసి బస్‌లలో ప్రయాణం చేస్తారు. వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి వారికి వివరిస్తారు. వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు.
ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసింది. వాటికి అనుగుణంగా ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తుంది. కానీ ఇలా బస్ ఎక్కిన తర్వాత ఫ్రీగా ట్రావెల్ చేస్తామంటే వీలు లేదు. ఉచితంగా ఆర్టీసీ బస్‌లో ప్రయాణం చేయాలంటే మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉచితంగా ప్రయాణం చేసే వాళ్లకి కూడా టికెట్ ఇస్తారు. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం అవుతుంది. అందుకే ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించిన బస్‌లో ట్రావెల్ చేసినప్పుడు కండక్టర్‌ను అడిగి టికెట్ తీసుకోండి. లేకుంటే మీరు సమస్యల్లో పడతారు. టికెట్ రేటు కంటే ఎక్కువ ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
ఉచిత బస్ ప్రయాణం చేయాలంటే చూపించాల్సిన కార్డులు
ఉచితంగా ప్రయాణం చేయాలంటే మాత్రం మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలై ఉండాలి. అందుకు తగిన ప్రూఫ్ మీరు చూపించాలి. అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు ఇలా ఏదో ఒక మీ ఫొటో ఉన్న గుర్తింపు కార్డు కండక్టర్‌కు చూపించిన తర్వాతే టికెట్ ఇస్తారు. ఈ కింద చెప్పిన కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలి.
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- ఓటర్ ఐడీ
- డ్రైవింగ్ లైసెన్స్
- ప్రభుత్వం గుర్తించే ఇతర కార్డులు
- కార్డుపై మీ ఫొటో కచ్చితంగా ఉండాలి
- కార్డుపై మీ స్థానికతను తెలియజేసే అడ్రెస్ ఉండాలి
- జిరాక్స్ కాపీలు చెల్లవు
- ఒరిజినల్ కార్డులను మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు.
- విద్యార్థులు అయితే స్కూల్‌లో ఇచ్చిన ఐడీ కార్డు చూపించాలి
- వీటిలో ఏది లేకపోయినా మీరు డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఫైన్ కట్టాలి. అందుకే ఎల్లప్పుడూ మీ వద్ద ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంచుకోవడం మంచిది.
ఏ బస్‌లలో ఉచిత ప్రయాణం చేయవచ్చు?
అన్ని బస్‌లలో ఉచితంగా ప్రయాణం చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. కేవలం పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ బస్‌లు, ఎక్స్‌ప్రెస్‌లలో మాత్రమే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ బస్‌లలో మాత్రమే జీరో ఫెయిర్ టికెట్ ఇస్తారు. ఇంద్రా ఏసీ, సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, ఇతర రాష్ట్రాలకు నడిపే సర్వీస్‌లకు ఉచిత పథకం వర్తించదు. అందులో ప్రయాణం చేయాలంటే మాత్రం టికెట్ తీసుకోవాల్సిందే.