NTR Jayanti 2025 | అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (NTR) జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది మే 28న రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జీవోఎంఎస్ నెంబర్ 54ను జారీ చేశారు. 

దివంగత నేత ఎన్టీఆర్ అసాధారణ జీవితం, ఆయన దూరదృష్టి కలిగిన నాయకత్వం, కళాత్మక ప్రతిభ, తెలుగు ప్రజల పట్ల నిబద్ధతతో తెలుగువారిపై చెరిగిపోని ముద్ర వేశారని ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రతి సంవత్సరం మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతి (NTR Jayanti)ని 'రాష్ట్ర స్థాయి వేడుకగా' జరుపుకోవాలని పేర్కొంటూ ఏపీ సీఎస్ విజయానంద్ జీవో జారీ చేశారు.

ప్రస్తుతం కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతోంది. టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత సీఎం ఎన్టీఆర్ జయంతికి ఒక్కరోజు ముందు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు.